తెలంగాణ

telangana

ETV Bharat / health

షుగర్​, అధిక బరువుతో బాధపడుతున్నారా? - రాగులు ఇలా తింటే ఎంతో మేలట! - HEALTH BENEFITS OF FINGER MILLET

-ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్న రాగులు - రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలంటున్న నిపుణులు

Health Benefits of Finger Millet
Health Benefits of Finger Millet (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2024, 10:34 AM IST

Health Benefits of Finger Millet:మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్న వయసులోనే డయాబెటిస్​, ఊబకాయం వంటి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. వీటిని దూరం చేసుకోవాలంటే సరైన ఆహార నియమాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అందులో భాగంగానేరాగులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకలా ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

ఎముకల దృఢత్వానికి:రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుందని.. ఇది ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే దంత సమస్యలను కూడా దూరం చేసి.. దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు. అందుకే.. ఎదిగే పిల్లలకు రాగులను క్రమం తప్పకుండా ఇవ్వాలంటున్నారు నిపుణులు. అలాగే వయసు మళ్లిన వారు కూడా రాగులను తీసుకోవడం ద్వారా ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

బరువు అదుపులో: ప్రస్తుత రోజుల్లో అధిక బరువుతో బాధపడేవారు అనేకం. అయితే.. ఈ సమస్యతో బాధపడేవారు రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వెయిట్​ను అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. రాగుల్లో ఫైబర్ ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉంటుందని.. దానివల్ల కొద్ది మొత్తంలో తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుందని.. ఫలితంగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలన్న కోరిక దరిచేరదంటున్నారు. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయని చెబుతున్నారు.

గ్లూకోజ్ అదుపులో: బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ‘గ్లైసెమిక్‌ ఇండెక్స్‌’ చాలా తక్కువగా ఉంటుందని.. ఫలితంగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయని చెబుతున్నారు. రాగులు తీసుకోవడం డయాబెటిస్​ తగ్గుతుందని.. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​ సభ్యులు బృందం కూడా స్పష్టం చేసింది.(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

గర్భిణులు, పాలిచ్చే తల్లులకు: రాగుల్లో కాల్షియంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌ కూడా అధికంగా ఉంటుంది. ఇది గర్భిణులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని.. కాల్షియం, ఐరన్‌, అమైనో ఆమ్లాలు పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు.

అందానికీ: రాగులు కేవలం ఆరోగ్యానికే కాదు.. అందాన్నీ ద్విగుణీకృతం చేస్తాయంటున్నారు నిపుణులు. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్‌ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడతాయని.. అలాగే వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచి.. చర్మం ముడతలు పడకుండా చేస్తాయని అంటున్నారు.

రాగులను ఎలా తీసుకోవాలి: రాగులతో చేసినవి అనగానే చాలా మంది జావ మాత్రమే గుర్తుకువస్తుంది. కానీ అది మాత్రమే కాకుండా వివిధ రకాల వంటకాలు కూడా చేసుకోవచ్చు. అందులో ఇడ్లీ, దోశ, లడ్డూ, కేక్‌, హల్వా, పూరీ, పరోటా.. వంటివి ఉన్నాయి.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బియ్యం పిండి దోశలతో షుగర్ సమస్యా? - ఇలా "రాగి దోశలు" చేసుకోండి! - సూపర్ టేస్టీ, ఇంకా ఆరోగ్యం

తెల్ల ఇడ్లీతో షుగర్ సమస్యా! - చక్కటి ఆరోగ్యాన్ని అందించే రాగి ఇడ్లీ - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details