Health Benefits of Eating Dragon Fruit :శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్ల పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ప్రకృతి ప్రసాదించే వీటిని తినాలని వైద్యులు సూచిస్తుంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచన ప్రకారం.. ప్రతిరోజూ కనీసం 400 గ్రాముల పండ్లు తినాలట. వీటిలోని ఎన్నో పోషకాలు అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి.. ముప్పు నుంచి తప్పిస్తాయి. అయితే పండ్లు అంటే ఎన్నో రకాలు ఉంటాయి. అందులో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి. పులుపు, తీపి కలగలిపిన రుచిలో.. లేత ముంజకాయలను తలపించే గుజ్జుతో ఇది ఆకట్టుకుంటోంది. గతంలో దిగుమతి అయ్యే ఈ విదేశీ పండును.. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనూ విరివిగా పండిస్తున్నారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయని.. వాటి వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. అవేంటో తెలుసుకుందామా!
పోషకాలు ఇవే: డ్రాగన్ ఫ్రూట్‌లో ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని.. అంతేకాకుండా ఐరన్, జింక్, మాంసకృత్తులు, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఈ పండులో దండిగా ఉంటాయంటున్నారు.
ప్రయోజనాలు ఇవే:
- ఇంటిపనీ, వంటపనీ చేసేసరికి ఎక్కడలేని నిస్సత్తువ ఆవరిస్తుంది మహిళలను. ఇక ఈ పరిస్థితి నుంచి వెంటనే బయటపడాలంటే.. కాసిని డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు తింటే మంచిదంటున్నారు. ఇవి ఒంట్లోని శక్తి స్థాయుల్ని పెంచుతాయయంటున్నారు. ఇక ఈ పండులో కనీసం 102 కెలొరీల శక్తి ఉంటుందట. అలాగని బరువు పెరుగుతామనే భయం అస్సలు అక్కర్లేదంటున్నారు.. ఎందుకంటే దీనిలో కొవ్వులు చాలా మితంగానే లభిస్తాయని చెబుతున్నారు.
- డ్రాగన్ ఫ్రూట్‌లో పొట్ట ఆరోగ్యానికి తోడ్పడే ప్రొబయాటిక్స్ పుష్కలంగా ఉంటాయంటున్నారు. ఇవి జీర్ణసమస్యల్ని తగ్గిస్తాయని.. జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని అంటున్నారు.
- డ్రాగన్ ఫ్రూట్ గింజల్లో ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దండిగా ఉంటాయని.. ఇవి గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయంటున్నారు. ఇందులోని మెగ్నీషియం హార్ట్ఎటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.
- ఈ పండులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్‌తో ధీటుగా పోరాడుతుందని.. వాటిని నాశనం చేయడం ద్వారా.. క్యాన్సర్ ముప్పును అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIH) సభ్యుల బృందం స్పష్టం చేసింది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
- ఈ ఫ్రూట్‌లో ఇనుము, ఫోలేట్, విటమిన్ బి ఉంటాయని.. ఇవి మహిళల్లో రక్తహీనత సమస్యను తొలిగిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడతాయంటున్నారు. అంతేకాకుండా ఇందులోని మెగ్నీషియం ఒత్తిడిని అదుపులో ఉంచి.. మంచి నిద్రను అందిస్తుందంటున్నారు.
- ఫ్లేవనాయిడ్లు, బీటా-సానిన్, ఫినోలిక్, ఆస్కార్బిక్ యాసిడ్‌లు.. ఈ పండులో ఉంటాయని.. ఇవి డయాబెటిక్ రోగుల పోషక అవసరాలను తీరుస్తాయని చెబుతున్నారు. అలాగే బాడీలోని చక్కెర స్థాయుల్ని తగ్గిస్తాయని వివరిస్తున్నారు.