Hair Growth With Rice Water :ప్రతిపూట కాకపోయినా ప్రతిరోజు మన వంటింట్లో లభించే గంజి లేదా రైస్ వాటర్‌తో బోలెడన్ని లాభాలున్నాయి. ముఖ్యంగా సౌందర్య ప్రియులు వీటిని సరిగ్గా వాడితే ఎలాంటి క్రీములు, లోషన్లు, నూనెలు, షాంపూలు లాంటివి అవసరమే లేదు. బియ్యం కడిగిన నీళ్లలోని పోషక విలువలు అందాన్ని రెట్టింపు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా వెంట్రుకలకు రైస్ వాటర్‌ను(Rice Water For Hair) ఉపయోగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
మెరిసే కురులు
రైస్ వాటర్ మీ వెంట్రుకలకు సహజమైన మెరుపునిస్తుంది. బియ్యం కడిగిన నీళ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్ వెంట్రుకలకు రక్షణ పొరను ఏర్పాటు చేసి అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.
బలం
బియ్యం కడిగిన నీళ్లలోని అమినో యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టుకు చక్కటి పోషణను అందిస్తాయి. కుదుళ్ల నుంచి బలాన్ని చేకూర్చి వెంట్రుకలు రాలకుండా కాపాడతాయి. అలాగే కుదుళ్లకు అవసరమైన సహజమైన పీహెచ్ లెవెల్స్‌ను పెంచి జుట్టు పొడిబారకుండా చూస్తాయి.
పట్టులా మృదువుగా
రైస్ వాటర్‌ను ఉపయోగించడం వల్ల మీ జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది. చాలా మందికి వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి పెరుగుదల ఆగిపోతుంది. బియ్యం కడిగిన నీటిలో ఉండే పోషకాలు, అమైనో యాసిడ్లు, విటమిన్లు మీ జుట్టును కుదుళ్ల నుంచి చివర్ల వరకూ ఆరోగ్యంగా ఉంచుతాయి. తరచూ మీ జుట్టుకు రైస్ వాటర్‌ను పట్టించడం వల్ల పగుళ్లు తగ్గి మంచి ఎదుగుదల కనిపిస్తుంది.
దురదకు చెక్
చాలామందికి తలలో తరచుగా ఇబ్బంది పెట్టే సమస్య దురద. చెమట, చుండ్రు లాంటి చాలా కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. అలాంటి వారికి రైస్ వాటర్ బాగా ఉపయోగపడతాయి. బియ్యం కడిగిన నీళ్లలో మీ తలలో ఉన్న దురద, చికాకును తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.