Guillain Barre Syndrome Symptoms:దేశంలో మరో కొత్త వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పుణె, పరిసర ప్రాంతాల్లో ఇటీవల "గీయే బరే" సిండ్రోమ్ వేగంగా వ్యాపిస్తోంది. ఇది కొత్త జబ్బేమీ కాకపోయినా.. అరుదైనదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా లక్ష మందిలో ఒకరో ఇద్దరికో వచ్చే వ్యాధి.. ఇప్పుడు కొద్ది ప్రాంతంలోనే ఉన్నట్టుండి పెద్ద ఎత్తున విజృంభించటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఒక్క వారంలోనే 100కి పైగా మంది దీని బారినపడగా.. కొందరికి వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స చేయాల్సిన పరిస్థితీ తలెత్తుతోంది. మామూలుగా పెద్దవారికే పరిమితమయ్యే ఇది ప్రస్తుతం పిల్లలు, శిశువుల మీదా దాడి చేస్తుండటం.. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటం, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుండటం మరింత కలవరానికి కారణం అవుతోంది. అందుకే ప్రభుత్వాలు సైతం దీని కట్టడి మీద నిశితంగా దృష్టి సారించాయి. అయితే, ఇది నేరుగా ఒకరి నుంచి మరొకరికి సోకేది కాకపోయినప్పటికీ కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతా జాగ్రత్తగా ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
"గీయే బరే సిండ్రోమ్‌ను ఒకరకంగా పరోక్ష జబ్బు, మరో రకం పక్షవాతమనీ చెప్పుకోవచ్చు. ఇది చాలావరకూ ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు వచ్చిన తర్వాతే ప్రారంభమవుతుంది. ఫలితంగా పక్షవాతం మాదిరిగా కండరాలు చచ్చుబడటానికీ దారితీస్తుంది. సాధారణంగా ఏవైనా బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్లు తలెత్తిన సమయంలో మన రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితమై వాటిని ఎదుర్కోవటానికి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి హాని కారకాల పని పట్టి, ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. అయితే ఈ యాంటీ బాడీలు పొరపాటున కొందరిలో వారి కణజాలాన్నే శత్రువుగా భావించి దాడి చేస్తాయి. ఫలితంగా సొరియాసిస్, ల్యూపస్ వంటి స్వీయరోగనిరోధక (ఆటోఇమ్యూన్) వ్యాధులు వస్తాయి. గీయే బరే సిండ్రోమ్ సమస్య కూడా ఇలానే వ్యాపిస్తుంది. వెన్నుపాము నుంచి కాళ్లు, చేతుల వంటి భాగాలకు వెళ్లే నాడుల మీది పొరను ఈ యాంటీబాడీలు దెబ్బతీయటం (మాలిక్యులర్ మిమిక్రీ మెకానిజం) వల్ల ఈ సమస్య తలెత్తుతుంది."
--డాక్టర్ పి. రంగనాథం, న్యూరోసర్జన్
లక్షణాలు ఇవీ
"గీయే బరే" సిండ్రోమ్ సాధారణంగా పాదాలు, కాళ్లలో జలదరింపు, బలహీనతతో మొదలై చేతులు, ఛాతీ, మెడ, ముఖం వంటి భాగాలకు విస్తరిస్తుందని డాక్టర్ పి. రంగనాథం తెలిపారు. అందుకే దీన్ని అసెండింగ్ పెరాలసిస్ అనీ అంటారని తెలిపారు. సమస్య ముదురుతున్నకొద్దీ కండరాల బలహీనత పక్షవాతంగానూ మారుతుందని వివరిస్తున్నారు. చాలావరకూ కదలికలకు తోడ్పడే చలన నాడుల మీదే ప్రభావం చూపినా కొందరిలో గుండె, శ్వాస వేగం వంటి పనులను నియంత్రించే స్వయంచాలిత నాడీ వ్యవస్థనూ దెబ్బతీయొచ్చని అంటున్నారు. అందువల్ల ప్రభావితమైన అవయవాలను బట్టి వేర్వేరు లక్షణాలు కనిపిస్తుంటాయని వెల్లడిస్తున్నారు.
- వేళ్లు, మణికట్టు లేదా మడమల వద్ద సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం.
- కాళ్ల నొప్పులు, ఇంకా కాళ్లలో మొదలైన బలహీనత పైకి వ్యాపించడం.
- సరిగ్గా నడవలేకపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, నడుస్తున్నప్పుడు తూలటం.
- మాట్లాడటం, నమలటం, మింగటంలో ఇబ్బందులు, నోరు వంకర పోవటం.
- ఒకటికి రెండు దృశ్యాలు కనిపించటం, కళ్లను కదిలించ లేకపోవటం.
- శ్వాస తీసుకోవటానికి తోడ్పడే కండరాలు బలహీనంగా మారడం. ఈ తీవ్ర దశలో వెంటిలేటర్ అమర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది.
- గుండె వేగం అస్తవ్యస్తం, రక్తపోటులో హెచ్చుతగ్గులు. ఇలాంటివి గలవారికి పేస్‌మేకర్ అమర్చాలి.
- అరుదుగా కొందరికి విపరీతమైన చెమటలు పట్టొచ్చు. గులియన్ బారీలో ఇదో ప్రత్యేక లక్షణం.
నిర్ధరణ ఎలా?
గీయే బరే సిండ్రోమ్‌ను ఆయా లక్షణాలను బట్టే అంచనా వేయొచ్చని నిపుణులు అంటున్నారు. కాళ్లు, చేతుల్లో బలహీనత కనిపించినప్పుడు కొద్ది వారాల ముందు విరేచనాలు, కడుపునొప్పి వంటి వాటిని వేధించాయా? అని చూడటం చాలా ముఖ్యమని అంటున్నారు. ఒకవేళ సమస్యను అనుమానిస్తే కొన్ని పరీక్షలతో నిర్ధరిస్తారని వివరించారు.
నర్వ్ కండక్షన్: ఈ పరీక్షలో భాగంగా నాడుల మీది చర్మానికి ఎలక్ట్రోడ్లను అమర్చి, స్వల్పంగా షాక్ ఇస్తారు. దీంతో నాడీ సంకేతాలు ఎంత వేగంగా ప్రసరిస్తున్నాయో తెలుసి.. సమస్య ఉంటే బయటపడుతుంది.
ఎలక్ట్రోమయోగ్రఫీ: ఇందులో కండరాల్లోకి సన్నటి ఎలక్ట్రోడ్లను జొప్పించి, నాడుల పనితీరును గుర్తిస్తారు.
సీఎస్‌ఎఫ్ పరీక్ష: వెన్నుపాము నుంచి ద్రవాన్ని (సీఎఫ్‌సీ) తీసి చేసే పరీక్ష ఇది. మెదడువాపు వంటి సమస్యల్లో మాదిరిగా కాకుండా "గీయే బరే" సిండ్రోమ్ గలవారిలో ప్రొటీన్ (అల్బుమిన్) మోతాదు ఎక్కువగా, తెల్ల రక్తకణాల సంఖ్య నార్మల్‌గా లేదా తక్కువగా (అల్బుమిన్ సైటొలాజికల్ డిసోసియేషన్) ఉండటాన్ని బట్టి సమస్యను నిర్ధరిస్తారు.
ఎంఆర్‌ఐ: ఇతరత్రా నాడీ సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుసుకోవటానికి ఎంఆర్‌ఐ పరీక్ష కూడా అవసరం అవుతుంది.
"మనం నడవటం వంటి పనులు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మెదడు ముందుగా వెన్నుపాముకు విద్యుత్ సంకేతాలు పంపిస్తుంది. ఇవి వెన్నుపాము నుంచి వచ్చే పెరిఫెరల్ నాడుల ద్వారా చేతులు, కాళ్లు, ఛాతీ వంటి భాగాల్లోని కండరాలకు ప్రసరిస్తాయి. ఇంట్లో విద్యుత్తు తీగల మీద మందమైన ప్లాస్టిక్ పొర మాదిరిగానే నాడుల చుట్టూరా మైలీన్ అనే రక్షణ పొర అమర్చి ఉంటుంది. ఇది దెబ్బతినటమే గీయే బరే సిండ్రోమ్‌కు ప్రధాన కారణం. మైలీన్ పొర క్షీణిస్తే నాడీ సంకేతాలు ముందుకు ప్రసరించటం నెమ్మదిస్తుంది. షార్ట్ సర్క్యూట్ తలెత్తి సంకేతాలు అస్తవ్యస్తం కూడా అవుతాయి. ఫలితంగా కాళ్లు, చేతుల వంటి అవయవాలు బలహీనం అవుతాయి. నాడీ సంకేతాలు అందటం మరీ నెమ్మదించినా, వాటికి అడ్డంకి తలెత్తినా బలహీనత ఎక్కువై, పక్షవాతంలో మాదిరిగా కండరాలు చచ్చుబడే ప్రమాదం ఉంటుంది."