Green Tea Vs Black Tea Which Is Better : మనలో దాదాపుగా అందరికీ.. ఉదయాన్నే టీ, కాఫీ గొంతులో పడకపోతే రోజు మొదలు కాదు. అయితే.. అధిక బరువుతో బాధపడేవారు, షుగర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడేవారు.. గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటివి తాగుతుంటారు. మరి.. గ్రీన్ టీతాగడం మంచిదా? లేదంటే బ్లాక్ టీ తాగడం మంచిదా? అనే సందేహం చాలా మందిలో కలుగుతుంటుంది! ఈ రెండింటిలో ఏది మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గ్రీన్ టీ ఉపయోగాలు:
- గ్రీన్ టీ తయారు చేయడానికి 'కామెల్లియా సినెన్సిస్' ఆకులను ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. పాలీఫెనాల్ కంటెంట్ శరీరంలో కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది.
- ఈ టీ తాగడం వల్ల టైప్-2 డయాబెటిస్, అల్జీమర్స్, కాలేయ వ్యాధులు తగ్గుతాయని నిపుణులంటున్నారు.
- గ్రీన్ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.
- ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని చెబుతున్నారు.
- 2015లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం గ్రీన్ టీ తాగడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు వెల్లడించారు.
- గ్రీన్ టీలో కెఫీన్ ఉంటుంది. అయితే బ్లాక్ టీ కంటే తక్కువ మొత్తంలో ఉంటుందట. అందువల్ల గ్రీన్టీతో మెదడు పనితీరు మెరుగుపడుతుందట.
- గ్రీన్ టీ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయులను పెంచుతుందని నిపుణులంటున్నారు.
- అధిక బరువుతో ఉన్న వారు దీన్ని తాగడం వల్ల కొవ్వును కరిగించుకోవచ్చని చెబుతున్నారు.
బ్లాక్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
- దీన్ని తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందట. అలాగే రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుందని నిపుణులంటున్నారు.
- అలాగే బ్లాక్ టీ బ్లాక్ టీ పేగుల్లోని బ్యాక్టీరియాను వృద్ది చేస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి ఆరోగ్యకరంగా బరువు తగ్గే వీలుంటుంది.
- బ్లాక్ టీ తాగడం వల్ల మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి.
- ఇంకా గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. దీన్ని రోజూ తాగడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందట.
- 2020లో ప్రచురించిన 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం' నివేదిక ప్రకారం క్రమం తప్పకుండా బ్లాక్ టీని తాగడం వల్ల ఎముకల బలంగా తయారవుతాయట.
- అలాగే ఎముకలు విరిగిపోవడం వంటి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వెల్లడించారు.
- మొత్తంగా చూసినప్పుడు.. గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండింటిలో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
- మీకు ఆరోగ్య అవసరాల రిత్యా.. మీకు ఏది మంచిదనిపిస్తే.. అది ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.