Good Cholestrol Health Benefits :మన శరీరానికి శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం ద్వారా అందే శక్తి ఎక్కువైనప్పుడు శరీరం ఈ శక్తిని కొలెస్ట్రాల్ రూపంలోకి మార్చుకొని నిల్వ ఉంచుకుంటుంది. ఇలా నిల్వ ఉంచిన కొలెస్ట్రాల్ వల్ల కొన్నిసార్లు మనకు అనారోగ్య సమస్యలు రావచ్చు. అయితే కొలెస్ట్రాల్ అనగానే మనకు కీడు చేస్తుందనే భావన ఉంటుంది. అయితే, ఇందులో కొంతవరకు మాత్రమే నిజం ఉంది.
గుడ్ కొలెస్ట్రాల్ మంచిదే
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. లోడెన్సిటి లైపోప్రోటీన్ (ఎల్డీఎల్), హైడెన్సిటి లైపోప్రోటీన్ (హెచ్డీఎల్) అనే రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. వీటిలో లోడెన్సిటి లైపోప్రోటీన్ అనేది శరీరాన్ని కాస్త ఇబ్బంది పెట్టేది. ఇది తరుచూ గుండె సంబంధిత ఇబ్బందులకు కారణమవుతుంది. ఇక హెచ్డీఎల్ అనేది మన శరీరానికి మేలు చేసేది. దీని వల్ల హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవడమే కాకుండా కొత్త కణాల ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో శరీరానికి మేలు చేసే హెచ్డీఎల్ని పెంచుకోవడానికి ఆయుర్వేదంలో ఏడు రకాల నూనెల గురించి ప్రస్తావించారు. మరి ఆ నూనెలు ఏంటి? వాటి వల్ల చేకూరే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కొబ్బరినూనె
భారతీయులు ఎక్కువగా వినియోగించే కొబ్బరినూనె హెచ్డీఎల్ను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. లారిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరినూనెను తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ మోతాదు పెరిగి అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.
నువ్వుల నూనె
ఆయుర్వేదంలో ఎక్కువ ప్రాధాన్యం కలిగిన నూనెల్లో నువ్వుల నూనె ఒకటి. ఇందులో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్, పాలిశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి హెచ్డీఎల్ పెరుగుదలకు ఉపయోగపడతాయి.
ఆలివ్ నూనె
గుండె రక్షణకు ఎంతో ప్రాచుర్యం పొందిన ఆలివ్ ఆయిల్ వల్ల శరీరంలో హెచ్డీఎల్ లెవెల్స్ పెరగడమే కాకుండా ఎల్డీఎల్ స్థాయులు తగ్గుతాయి. ఆలివ్ నూనెలో లభించే యాంటీఆక్సిడెంట్లు మంట స్థాయులను తగ్గిస్తాయి. అంతేకాకుండా గుండెను పదిలంగా ఉంచుతాయి.
ఆవ నూనె
వంట గదిలో ఎక్కువగా వాడే ఆవ నూనెతో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్, పాలిశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ రెండూ శరీరంలో పెరుగుతాయి. ఇది హెచ్డీఎల్ పెరుగుదలకు దోహదం చేస్తుంది. అందుకని ఈ నూనెను వంటకాల్లో వాడితే మంచిది.