Ghee Tea Benefits and Disadvantages : ట్రెండ్ ఆహార్యంలోకి మాత్రమే కాదు.. ఆహారంలోకి కూడా వచ్చేసింది! ఏం తినాలి? ఎలా తినాలి? అనే విషయమై సోషల్ మీడియాలో నిత్యం వందలాది పోస్టులు, వీడియోలు వచ్చిపడుతున్నాయి. వీటిల్లోంచి తమకు నచ్చిన వాటిని జనం పిక్ చేసుకుంటున్నారు. అలా.. కొన్ని ఆహార పద్ధతులు వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటే నెయ్యితో తయారు చేసే టీ.
రోజువారీ పనుల్లో అలసట తగ్గించడానికి, హెల్దీ జీవితానికి ఈ నెయ్యి చాయ్ మంచిదని ప్రచారం సాగుతోంది. దీంతో చాలా మంది ఈ టీ తీసుకుంటున్నారు కూడా! అయితే.. అది ఎంత వరకు మంచిది? నిత్యం తీసుకుంటే శరీరంలో ఏం జరుగుతుంది? ఎవరు తీసుకోవచ్చు.. ఎవరు తీసుకోకూడదు? వంటి విషయాలు చాలా మందికి తెలియదు. ఇలాంటి సందేహంతోనే ఓ యువతి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు.. ప్రముఖ పోషకాహార నిపుణులు జానకీ శ్రీనాథ్. మరి.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ రోజుల్లో ట్రెండ్ ఫాలోఅవుతూ తిండి సెలక్ట్ చేసుకునేవాళ్లు ఎక్కువవుతున్నారని.. అవి తమ ఒంటికి సరిపడక ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఉన్నారని జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. అయితే.. ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలని అనుకున్నా.. దానికి ముందు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. మీరు ఎంత ఎత్తు ఉన్నారు? బరువు ఎంత? మీ శరీరతత్వం ఏంటి? (అంటే.. కొన్ని ఆహారాలు కొందరి పడవు) ఇలా.. అన్ని విషయాలపైనా క్లారిటీ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత మీకు తగినట్టుగా డైట్ ప్లాన్స్ రూపొందించుకోవాలని చెబుతున్నారు.
ఈ నెయ్యి టీ విషయానికి వస్తే.. చాలా మంది బరువు, షుగర్ తగ్గించుకోవాడనికి లో-కార్బ్ డైట్, కీటోజెనిక్ డైట్స్ ఫాలో అవుతున్నారు. వీరు ఎక్కువగా కార్బో హైడ్రేట్స్ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తారు. అందుకే.. ఈ డైట్స్ పాటించేవారు పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉంటారని జానకి చెబుతున్నారు. పొద్దున్నే వీరు బ్లాక్ టీ, నెయ్యి చాయ్ వంటి ఆల్టర్నేటివ్స్ తీసుకుంటారు. లాక్టోజ్‌ను జీర్ణం చేసుకోలేని వాళ్లు కూడా ఈ చాయ్ తీసుకుంటారని చెబుతున్నారు.
ప్రస్తుతం జనం పాటిస్తున్న ఆధునిక ఆహార పద్ధతుల కారణంగా మలబద్ధకం సమస్య చాలా మందిలో ఉంటోందని అన్నారు. ఇలాంటి వారు నెయ్యి, వెన్న కలిపిన చాయ్ తాగితే కొంతవరకు సమస్య తగ్గుతుందని చెప్పారు. అంతేకాదు.. నెయ్యి టీని అన్ని వయసుల వారూ తీసుకోవచ్చునని అన్నారు. కానీ.. రిజల్ట్ వెంటనే ఆశించడం సరికాదని సూచించారు. కొత్తగా మనం ఎలాంటి ఆహారం తీసుకోవడం మొదలు పెట్టినా.. శరీరం దానికి అలవాటు పడడానికి కొంత కాలం పడుతుందని చెబుతున్నారు. అయితే.. రెండు సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం దీనికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎసిడిటీ, రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్లు ఈ నెయ్యి టీ తాగకపోవడమే మంచిదని జానకీ శ్రీనాథ్ సూచిస్తున్నారు.