Is Ghee Good For Health : స్ఫైసీగా చేసుకునే బిర్యానీ నుంచి కమ్మగా ఉండే స్వీట్ల వరకూ అన్నింట్లో నెయ్యి ఉండాల్సిందే. కారణం నెయ్యి ఎందులో వేసినా ఆ రుచి అమృతంతో సమానం. కానీ ఇప్పుడంతా కెలొరీల లెక్కే. అందుకే, కాస్త ఘాటెక్కువగా ఉన్న కూరలో రెండు చుక్కల నెయ్యి వేస్తానన్నా.. "అమ్మో వద్దు" అనేస్తుంటారు చాలా మంది. కానీ, రోజూ నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు నిపుణులు. ఇంతకీ, డైలీనెయ్యి(Ghee)తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి? రోజూ ఎంత నెయ్యి తినాలి? ఏ నెయ్యి ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నెయ్యి తినడం వల్ల లాభాలు:
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది : రోజూ తినేటప్పుడు మొదటి ముద్దలో రెండు చుక్కలు నెయ్యి కలుపుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇలా తీసుకోవడం వల్ల తిన్నది త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా.. గ్యాస్ సంబంధిత సమస్యలూ దరి చేరవంటున్నారు.
మలబద్ధకాన్ని పోగొడుతుంది :మలబద్ధకంతో ఇబ్బందిపడేవారు రోజూ మార్నింగ్ పరగడుపున ఒక చెంచా నెయ్యి తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి మంచి రిలీఫ్ పొందవచ్చంటున్నారు నిపుణులు. 2018లో 'అలిమెంటరీ ఫార్మకాలజీ అండ్ థెరపిటిక్' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఖాళీ కడుపున ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవడం మలబద్ధకం లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. ఈ రీసెర్చ్‌లో 'నాంజింగ్ మెడికల్ యూనివర్సిటీ'కి చెందిన గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. X.Y. Zhang పాల్గొన్నారు. పరగడుపున నెయ్యి తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు.
బరువు కంట్రోల్లో ఉంటుంది :నెయ్యిలో పోషకాల మోతాదూ ఎక్కువే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దీనిలో కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, దీని నుంచి మనకి అందే.. మంచి కొవ్వులు అధికబరువును అదుపులో ఉంచుతాయంటున్నారు. అలాగే, నెయ్యిలో ఉండే విటమిన్ ‘ఇ’ కాలేయాన్ని కాపాడడమే కాకుండా.. హర్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుందని సూచిస్తున్నారు.