తెలంగాణ

telangana

ETV Bharat / health

చిన్నతనంలోనే వృద్ధాప్య ఛాయలా? - ఈ ఫుడ్స్​ తినొద్దంటున్న నిపుణులు! - FOODS TO AVOID FOR HEALTHY SKIN

- జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగానే కరిగిపోతున్న యవ్వనం - పలు సూచనలు చేస్తున్న నిపుణులు

Foods to Avoid for Healthy Skin
Foods to Avoid for Healthy Skin (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2024, 11:40 AM IST

Foods to Avoid for Healthy Skin:ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే రోజూ మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తే.. మరికొన్ని మాత్రం హాని కలిగిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా చర్మం మీద సన్నని గీతలు.. ముడతలు ఏర్పడడం, పొడిబారిపోవడం, నిర్జీవంగా తయారవడం.. వంటి సమస్యలు తలెత్తుతాయట. వాటి వల్లనే చిన్నవయసులోనే వృద్ధాప్య లక్షణాలు(వార్థక్యపు ఛాయలు) సైతం కనిపిస్తుంటాయని అంటున్నారు. ఈ క్రమంలో చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మేలను సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చక్కెరలు: చాలా మంది బయట లభించే జ్యూస్‌లు, మిల్క్‌షేక్స్.. వంటి చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను విరివిగా తీసుకుంటారు. అయితే.. వీటిని తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, చర్మం ముడతలు పడటం.. వంటి సమస్యలు ఎదురవుతాయని.. తద్వారా యవ్వనంలోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయంటున్నారు. ఇదే విషయాన్ని NIH సభ్యుల బృందం కూడా స్పష్టం చేసింది(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి). కాబట్టి బయట దొరికే వాటికి బదులు ఇంట్లోనే ఆరోగ్యకరమైన రీతిలో తయారుచేసుకుంటే ఆరోగ్యంతో పాటు అందం కూడా లభిస్తుందని చెబుతున్నారు.

పాల ఉత్పత్తులు:పాలు, పాల ఉత్పత్తుల నుంచి శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి. కాబట్టి అవి ఆరోగ్యానికి మంచివే.. అయినప్పటికీ కొన్ని పాల సంబంధిత ఉత్పత్తులు మాత్రం చర్మ ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చీజ్, ఐస్‌క్రీమ్.. మొదలైనవి కొందరిలో మొటిమలు రావడానికి కారణమవుతాయని సూచిస్తున్నారు. కాబట్టి వీటికి కూడా సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండడం మంచిదని వివరిస్తున్నారు.

ఇవి కూడా:

  • డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, చిప్స్, జంక్‌ఫుడ్.. మొదలైన వాటికి పూర్తిగా దూరంగా ఉండడమే శేయస్కరమంటున్నారు నిపుణులు.
  • వీటిలో చక్కెర, నూనెలు అధికంగా ఉంటాయని.. ఇవి శరీరంలో వాపును పెంచి, వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చేలా చేస్తాయని అంటున్నారు.
  • క్యాన్డ్ లేదా ప్యాకేజ్డ్ ఫుడ్స్ జోలికి అస్సలు పోకూడదని.. ఒకవేళ తప్పనిసరిగా అటువంటి పదార్థాలు తీసుకోవాల్సి వస్తే అందులో సోడియం స్థాయులు తక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు.
  • అలాగే ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని.. లేదంటే ముఖం ఉబ్బినట్లుగా కనిపించడం, కళ్ల కింద వాపు, కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​.. వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు..
  • బియ్యం, బ్రెడ్, పాస్తా, బంగాళాదుంపలు వంటి అధిక గ్లైసెమిక్​ ఇండెక్స్​ కలిగిన ఆహారాలను తీసుకోవద్దని.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచి.. కొల్లాజెన్‌ ఉత్పత్తిని దెబ్బతీసి, యవ్వనంలోనే ముడతలు వచ్చేలా చేస్తాయని చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ ఆయుర్వేదిక్ మిశ్రమాన్ని రోజూ ఒక్క స్పూన్​ తింటే చాలు - మెరిసే అందం మీ సొంతం!

ఈ ఫేస్​ ప్యాక్​ను ఎప్పుడైనా ట్రై చేశారా? - ముఖంపై మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం!

ABOUT THE AUTHOR

...view details