Health Benefits of Flax Seeds : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందుకే చాలా మంది తమ డైట్లో డ్రై ఫ్రూట్స్, నట్స్, పండ్లను చేర్చుకుంటున్నారు. అయితే ఇవి మాత్రమే కాదు సీడ్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ముఖ్యంగాఅవిసె గింజల(Flax Seeds)ను తప్పనిసరిగా మీ డైట్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
అవిసె గింజలను ఎలా తీసుకోవాలంటే? :ఈ గింజలను పచ్చిగా తినడం కంటే డ్రైరోస్ట్ చేసి, పొడిచేసుకుని తింటే మంచిది అంటున్నారు నిపుణులు. అవిసె గింజలను వేయించడం ద్వారా అందులో ఉండే హానికారక ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. అలాగే మొలకెత్తించి తిన్నా కూడా మంచిదే. వీటిని నీళ్లలో వేసినప్పుడు కొద్దిగా ఉబ్బి జెల్లీలా మారతాయి. అంటే ఎక్కువగా నీళ్లను పీల్చుకుంటాయి. అందుకే ఇవి కొంచెం తిన్నా తర్వాత వాటర్ ఎక్కువ తాగాలనే విషయం మర్చిపోవద్దు. లేదంటే మలబద్ధకం సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. ఇక వీటి పొడిని డైలీ నీటిలో కొద్దిగా కలుపుకొని తాగవచ్చు. లేదంటే మీరు అన్నం వండుకునేటప్పుడే అందులో వీటి పొడి లేదా గింజలను యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అలాకాకుండా అవిసె గింజలను ఓట్స్, సలాడ్‌లు, స్మూతీలు లేదా మీకు ఇష్టమైన ఇతర ఆహారాలలో కలుపుకొని తినవచ్చు. వీటిని తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం..
కొలెస్ట్రాల్ తగ్గుతుంది :అవిసె గింజలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. సాధారణంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలలో ఉంటాయి. అయితే అవి తినలేని వారు వీటిని తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది : అవిసె గింజలలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇంకా, ఈ గింజలు బరువు నిర్వహణలో, అతిగా తినడం నివారించడంలో కూడా చాలా బాగా సహాయపడుతాయి.
యాంటీఆక్సిడెంట్ గుణాలు :ఏ శాకాహారంలోనూ లేనంత ఎక్కువగా అవిసె గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.