Fatty Liver Warning Signs on Skin : మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం(Liver) ఒకటి. ఇది శరీరానికి కావాల్సిన హార్మోన్లను రిలీజ్ చేయడం సహా.. వ్యర్థాలను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో లివర్ పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. అందుకు కారణం.. ప్రస్తుతం ఎంతోమంది ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతుండటమే. అయితే, దీనిపట్ల జాగ్రత్తగా వ్యవహారించకపోతే ప్రాణాలకే ప్రమాదమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ మీకు ఫ్యాటీ లివర్(Fatty Liver) సమస్య ఉంటే.. మీ చర్మంపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. వాటి ద్వారా ముందే ఈ సమస్యను గుర్తించి తగిన ట్రీట్మ్మెంట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది : మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లయితే.. అప్పుడు కాలేయం రక్తనాళాలలో చేరకుండా తొలగించే ప్రొటీన్లను తగిన స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతుంది. ఫలితంగా మీ ముఖం కొద్దిగా ఉబ్బినట్లు కనిపించడాన్ని గమనించవచ్చంటున్నారు నిపుణులు.
డార్క్ స్కిన్ : ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఇన్సులిన్ నిరోధకతను పెంచడానికీ దోహదం చేస్తుంది. అంటే.. మీ శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు. ఇది మీ శరీరంలో అదనపు ఇన్సులిన్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా మెడ దగ్గర చర్మం నల్లగా మారడం, చర్మంపై మడతలు ఏర్పడడాన్ని గమనించవచ్చంటున్నారు నిపుణులు.
రోసేసియా :మీకు రోసేసియా ఉన్నప్పుడు మీ ముఖంపై చిన్న ఎర్ర రక్తనాళాలు లేదా తెల్లటి గడ్డలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీలో ఇలాంటి లక్షణం కనిపిస్తే అది కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఉందని తెలిపే హెచ్చరిక కావొచ్చంటున్నారు.
దద్దుర్లు :మీకు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఉందని తెలిపే సంకేతాల్లో చర్మంపై దద్దుర్లు కూడా ఒకటని సూచిస్తున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నప్పుడు మీ శరీరం కొన్ని పోషకాలను సమర్థవంతంగా గ్రహించనివ్వదని.. ఫలితంగా చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయంటున్నారు. ముఖ్యంగా నోటి చుట్టూ చిన్న గడ్డలు ఏర్పడి చికాకుకు దారితీస్తుందంటున్నారు.
దురద :ముఖంపై దురద ఉంటే అది కూడా ఫ్యాటీ లివర్ సంకేతంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎలర్జీ కూడా తీవ్రంగా ఉంటుందట. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే అలర్ట్ కావాలంటున్నారు.