Selenium For Hair Fall : అప్పటి వరకూ అడవిలా గుబురుగా ఉన్న జుట్టు కాస్తా ఉన్నట్టుండి కుప్పలు కుప్పలుగా ఊడిపోతూ ఉంటుంది! కారణం ఏంటో అర్థం కాదు. ఏవేవో షాంపూలు వాడుతారు. ఇంకేవో పసర్లు పూస్తారు. ప్యాకులు వేస్తారు. అయినా గానీ జుట్టు ఊడిపోవడం ఆగదు. మగాళ్లలో బట్టతల వచ్చేదాకా, ఆడవాళ్లలో పిలక జడ వచ్చేదాకా ఆగనే ఆగదు! ఈ పరిస్థితికి రకరకాల కారణాలు ఉండొచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే, తాజాగా మరో కొత్త విషయం బయటపడింది. జుట్టు తీవ్రంగా రాలిపోవడానికి ఒక ఖనిజం కారణం అవుతుందట. అదే "సెలీనియం". మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
బాడీకి అత్యంత కీలకం :
సెలీనియం అనేది శరీరానికి అత్యంత కీలకమైన ఖనిజం. ఇది మాంసం, గుడ్లు, చిక్కుళ్లు, పొట్టు ధాన్యాలైన గోధుమలు, పొద్దు తిరుగుడు గింజలు, దంపుడు బియ్యం, పప్పులు, పాలకూర, పుట్ట గొడుగులు, పాలు, పెరుగు, అరటి పండ్లు, జీడిపప్పు వంటి వాటినుంచి లభిస్తుంది. ఇంకా మట్టిలో, నీటిలోనూ ఉంటుంది. దీని అవసరం శరీరానికి తక్కువే. కానీ మొత్తం ఆరోగ్యంలో అత్యంత కీలకం. థైరాయిడ్ రాకుండా, పునరుత్పత్తి సక్రమంగా ఉండేలా చూస్తుంది. డీఎన్‌ఏలోనూ కీలకం. కణాలు దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది.
ఎక్కువైతే మాత్రం అంతే :
శరీరంలో అంత ముఖ్యమైన సెలీనియం బాడీలో మోతాదులో మాత్రమే ఉండాలి. మించితే మాత్రం చాలా పెద్ద సమస్యలు వస్తాయి. దీనివల్ల జుట్టు రాలిపోతుంది. చర్మ సమస్యలు వస్తాయి. నరాల బలహీనత మొదలవుతుంది. గోళ్లు పెలుసుగా మారి విరిగిపోతుంటాయి. ఇలా పలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వెంట్రుకలపై సెలీనియం దాడి నేరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కుదుళ్లను బలహీనపరుస్తుందట. దాంతో జుట్టు వేగంగా రాలిపోతుందట.