Exercise Improves Brain Function:వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతుంటారు. అయితే, ఇది కేవలం శరీరాన్నే కాకుండా.. మెదడును కూడా బలోపేతం చేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వారానికి కనీసం 150 నిమిషాల సమయమైనా ఒకమాదిరి తీవ్ర ఏరోబిక్ వ్యాయామాలు చేయాలని నిపుణుల సిఫారసు చేస్తున్నారు. వేగంగా నడవటం, టెన్నిస్ వంటి ఆటలాడటం, సైకిల్ తొక్కటం, ఈత కొట్టటం వంటివన్నీ చేయాలని సూచిస్తున్నారు. ఇంకా బరువులు ఎత్తటం, పుషప్స్, బింగీలు తీయటం లాంటి బలంతో కూడిన వ్యాయామాలు కనీసం వారానికి రెండు రోజులైనా చేయాలని సలహా ఇస్తున్నారు.
ఒక్కోరకంతో ఒక్కో ప్రయోజనం
ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల కొవ్వు కరిగి బరువు అదుపులో ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇంకా బలంతో కూడిన వ్యాయామాలు కండర మోతాదు, ఎముకల పటుత్వాన్ని పెంచుతాయని వివరిస్తున్నారు. శరీరాన్ని సాగదీసే వ్యాయామాలైతే అటూఇటూ తేలికగా కదలటానికి, గాయాల పాలు కాకుండా చూసుకోవటానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. బ్యాలెన్స్ వ్యాయామాలు కింద పడకుండా కాపాడడమే కాకుండా.. మెదడునూ చురుకుగా ఉంచుతాయని వెల్లడిస్తున్నారు.
ఏం జరుగుతుంది?
మనం వ్యాయామం చేస్తున్నప్పుడు రక్తంలోకి రకరకాల అణువులు విడుదలవుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవి వివిధ అవయవాలు, కణజాలాల్లోకి చేరుకొని అక్కడ మార్పులను ప్రేరేపిస్తాయని వివరిస్తున్నారు. ఈ మార్పులు వ్యాయామం మూలంగా పడే ఒత్తిడిని తట్టుకోవటానికి కణాలకు సాయం చేస్తాయని అంటున్నారు. ఇంకా వృద్ధాప్య ప్రభావాలను తట్టుకోవటాన్నీ కణాలు అలవరచుకుంటాయని చెబుతున్నారు. 2011లో Neurologyలో ప్రచురితమైన Aerobic exercise increases hippocampal volume in older adults with mild cognitive impairment అనే అధ్యయనంలోనూ తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అధ్యయనాల దన్ను
మనకు వయసు మీద పడుతున్నకొద్దీ విషయ గ్రహణ సామర్థ్యాలు తగ్గుముఖం పడుతుంటాయి. ముఖ్యంగా నేర్చుకోవటం, గుర్తుంచుకోవటం చాలా కష్టంగా మారుతుంది. దీనికి వయసుతో పాటు మెదడులో కణస్థాయిలో మార్పులు సంభవిస్తుండటమే కారణమని నిపుణులు అంటున్నారు. మెదడు చుట్టూ ఉండే రక్షణ వలయమూ మారి.. అందులోకి హాని కారకాలు చేరుకునే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇంకా వ్యాయామంతో ఇలాంటి మార్పులు పాక్షికంగా తగ్గుతున్నట్టు ఎలుకల మీద నిర్వహించిన అధ్యయనాల్లో బయటపడింది. వృద్ధాప్యంతో ముడిపడిన విషయ గ్రహణ క్షీణత కూడా కొంతవరకూ తగ్గుతున్నట్టు తేలింది.