Exercise For Heart Attack Patients :హార్ట్ అటాక్ వచ్చి తగ్గిపోయిన తర్వాత వ్యాయామం చేయొచ్చా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. అలాంటి వారికి కార్డియాలజిస్టులు ఇచ్చే సలహా ఏంటంటే గుండెకు సంబంధించిన వ్యాయామాలతో పాటు నార్మల్ ఎక్సర్సైజులు కూడా చేయాలి. అయితే సాధారణంగా ఎక్సర్సైజ్ చేసే వాళ్లకి గుండె జబ్బు వచ్చి తగ్గిపోయిన వాళ్లు చేసే వ్యాయామాలకు చాలా తేడా ఉంటుందని వైద్యులు అంటున్నారు.
హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే గుండె పంపింగ్ తగ్గిపోవడం. ఇది తగ్గిపోవడం వల్ల సాధారణంగానే ఆయాసం రావడం, కాళ్లు వాపులు రావడం లాంటి సమస్యలు వచ్చే అవకాశముంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఎక్సర్ సైజులను చేసే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
సాధారణ గుండె పంపింగ్ 55 శాతం ఉంటుంది. ఈ స్థాయి తగ్గటాన్ని 'ఎల్వీ డిస్ ఫంక్షన్' అంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఎంతమేరకు తగ్గింది అని చెక్ చేసుకుని వ్యాయామం ప్రారంభించాలని సూచిస్తున్నారు. అది 30 శాతం కన్నా తగ్గితే ఎక్కువ వ్యాయామం చేయకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు. ఒక 6 నిమిషాల పాటు నెమ్మదిగా నడవాల్సిన అవసరం ఉంటుందని, అంతకంటే ఎక్కువ వేగంగా చేయడం కూడా మంచిది కాదని అంటున్నారు.
"ఎల్వీ డిస్ ఫంక్షన్ లేని వారు నెమ్మదిగా వ్యాయామం చేయడం మొదలు పెట్టాలి. గుండెపోటు తర్వాత స్టంట్ అమర్చడం విజయవంతంగా పూర్తయిన తరువాత హార్ట్ పంపింగ్ సాధారణంగానే ఉంటే వాళ్లు నడక స్టార్ట్ చేయవచ్చు. తర్వాతి కాలంలో నెమ్మదిగా నడక వేగాన్ని పెంచుతూ వ్యాయామాలు చేయవచ్చు. అయితే పంపింగ్ బలహీనంగా ఉన్నవారు మాత్రం ప్రధానంగా వాకింగ్ పైనే దృష్టి పెట్టాలి. ఈ వాకింగ్ కూడా ఒకేసారి ఎక్కువ దూరం చేయకుండా 5 నిమిషాలతో మొదలు పెట్టుకుని నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. రోజుకి సుమారు 45 నిమిషాల నుంచి గంట సేపు చేయగలిగే విధంగా క్రమంగా పెంచాలి"