Butter Naan and Chicken Curry Recipe : చాలా మంది బటర్ నాన్ను ఎంతో ఇష్టంగా తింటారు. అందులోకి చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్. ఎక్కువ మంది రెస్టారెంట్స్, హోటల్స్‌కి వెళ్లినప్పుడు ఈ రెండింటినీ తప్పక ఆర్డర్ చేస్తుంటారు. అయితే, ఇంట్లో దాదాపు అందరూ చికెన్ కర్రీ చేస్తారు. కానీ, బటర్‌నాన్ చేయడం కష్టమని అనుకుంటారు. ఎందుకంటే హోటల్స్‌లో వీటిని చేయడానికి తందూర్ ఉంటుంది. అయితే, ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఇంట్లోనే చాలా సింపిల్‌గా బటర్ నాన్.. దానికి కాంబినేషన్‌గా చికెన్ కర్రీ తయారు చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా వాటికి కావాల్సిన పదార్థాలు, ఎలా చేయాలో ఓ లుక్కేద్దాం.
చికెన్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు :
- చికెన్- అరకేజీ
- గసగసాలు - టేబుల్ స్పూన్
- వాటర్ మెలన్ సీడ్స్-టేబుల్ స్పూన్
- జీడిపప్పులు-5
- టమాటలు - 2
- పసుపు - అర టీ స్పూన్
- రుచికి సరిపడా - ఉప్పు
- కరివేపాకు - 2 రెబ్బలు
- ఉల్లిపాయ తరుగు - కప్పు
- పచ్చిమిర్చి చీలికలు - 2
- అల్లం ముక్కలు-2 చిన్నవి
- వెల్లుల్లి రెబ్బలు-10 (పొట్టుతీసినవి )
- కారం- 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కసూరీ మేథి -1 టీ స్పూన్
మసాలా పొడి కోసం:
- ధనియాలు-టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- దాల్చిన చెక్క - అంగుళం ముక్క
- యాలకులు - 4
- లవంగాలు - 6
- మిరియాలు-10
చికెన్ కర్రీ ప్రిపరేషన్..
- ముందుగా చికెన్ నీచు వాసన రాకుండా కాస్త ఉప్పు వేసి కడగండి. ఇక ఈ చికెన్ కర్రీ గ్రేవీ టేస్టీగా ఉండడానికి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం గసగసాలు, వాటర్ మెలన్ సీడ్స్, జీడిపప్పులు వేరువేరు గిన్నెలలో అరగంటపాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోండి.
- ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి టమాటా ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన గసగసాలు, వాటర్ మెలన్ సీడ్స్, జీడిపప్పులు వేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- తర్వాత మరో మిక్సీ గిన్నెలోకి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు కర్రీ వండడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టండి. ఇందులో 4 టేబుల్స్పూన్ల నూనె పోసి వేడి చేయండి.
- నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి మెత్తగా అయ్యేంతవరకు వేయించుకోవాలి.
- ఉల్లిపాయ మెత్తగా మారి రంగు మారుతున్నప్పుడు కడిగిన చికెన్ ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అనంతరం రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
- ఆపై గ్రెండ్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసి మిక్స్ చేయండి.
- ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చికెన్ 5 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత పసుపు, కారం, గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి మిక్స్ చేయండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి.
- ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 15 నిమిషాలు ఉడికించుకోండి.
- ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి కలపండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు, కాస్త కసూరీ మేథి చేతితో నలిపి వేసుకోండి. అనంతరం స్టవ్ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఘుమఘుమలాడే చికెన్ కర్రీ మీ ముందుంటుంది. ఇప్పుడు బటర్ నాన్ తయారీ చూద్దాం.
బటర్ నాన్ తయారీకి కావాల్సిన పదార్థాలు :
- మైదా - 2 కప్పులు
- బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్
- వంట సోడా - అరటీస్పూన్
- చక్కెర - టీస్పూన్
- ఉప్పు - చిటికెడు
- వెల్లుల్లి రెబ్బల తురుము -4 టేబుల్‌స్పూన్లు
- బటర్ - తగినంత
- నూనె - కొద్దిగా
- కొత్తిమీర తరుగు
తయారీ విధానం :
- బటర్ నాన్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పంచదార, ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దగా కలుపుకోండి. ఇప్పుడు కాస్త బటర్ వేసి రెండుమూడు నిమిషాలు కలుపుకోండి.
- ఇప్పుడు మరొక గిన్నెలో అడుగు భాగాన కొద్దిగా నూనె వేసి పిండి ముద్దను ఉంచండి. దీనిపై మూత పెట్టి 40 నిమిషాలు అలా వదిలేయండి.
- ఇప్పుడు పిండిని మరోసారి కలిపి.. 5 లేదా 6 చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని పొడి పిండిలో వేసి చపాతీ పీటపైకి తీసుకోండి.
- దీనిని చపాతీ కర్రతో రోల్ చేసుకోండి. ఆపై కాస్త వెల్లుల్లి రెబ్బల తురుము, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఫోల్డ్ చేయండి.
- అనంతరం దీనిని మరోసారి పొడి పిండిలో ముంచి చపాతీ పీటపైకి తీసుకోండి.
- ఇప్పుడు పిండి ఉండను చపాతీ రోలర్‌తో మరీ పల్చగా, మందంగా కాకుండా ఓవల్ షేప్‌లో రుద్దుకోవాలి.
- ఆవిధంగా రుద్దుకున్నాక ఒకవైపు కొద్దిగా వాటర్‌ను చేతితో అప్లై చేసుకొని ఆ సైడ్ ఇనుపు పెనానికి అంటుకునేటట్లు వేసుకోవాలి.
- ఆ స్టవ్ ఆన్ చేసి ఆ పెనాన్ని పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి.
- కాసేపటికి నాన్పై లైట్‌గా బబుల్స్ వస్తాయి. అప్పుడు మరోవైపునకు టర్న్ చేసుకొని పాన్‌పై కాల్చుకోవచ్చు. లేకపోతే నాన్ని డైరెక్ట్‌గా స్టౌపై ఉంచి అయినా కాల్చుకోవచ్చు.
- ఇలా అన్నింటిని చేసుకున్నాక వాటిపై కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి.
- ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ" రెడీ!
రెస్టారెంట్ స్టైల్ "బటర్ నాన్" - ఇంట్లోనే సులువుగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!