Somvati Amavasya 2024 : సనాతన ధర్మంలో సోమావతి అమావాస్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సోమావతి అమావాస్య శివారాధనకు విశిష్టమైనది. అత్యంత అరుదుగా వచ్చే సోమావతి అమావాస్య రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా కలిగే అశాంతిని, దారిద్య్ర బాధలను పోగొడుతుందని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే సుఖసంతోషాలు కలుగుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
సోమావతి అమావాస్య ఏ రోజున వస్తుంది?
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. అయితే అమావాస్య - సోమవారం రోజున వస్తే దానిని సోమావతి అమావాస్య అని అంటారు.
సోమావతి అమావాస్య - పురాణ కథనం
దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని, అల్లుడైన పరమశివుని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి అవమానానికి గురై శరీర త్యాగం చేస్తుంది. సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టిస్తాడు. సమస్త ప్రమద గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరిని చితకబాదుతాడు. శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు.
ఆ సమయంలో ఒంటి నిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు, త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుని పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతి అమావాస్యగా జరుపుకుంటున్నారు.
సోమావతి అమావాస్య ఎప్పుడు?
మార్గశిర బహుళ అమావాస్య డిసెంబర్ 30వ తేదీ సోమవారం తెల్లవారు ఝాము నుంచి మరుసటి రోజు తెల్లవారు జాము 3 గంటల వరకు సోమావతి అమావాస్య ఉంది. కాబట్టి డిసెంబర్ 30వ తేదీన సోమావతి అమావాస్యగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
సోమావతి అమావాస్య పూజకు శుభ సమయం
సోమావతి అమావాస్య పూజను ఉదయం 5 గంటల నుంచి 7:30 గంటల లోపు కానీ; ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటలలోపు కానీ చేసుకోవాలి. ఉదయం వీలుకానివారు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు చేసుకోవచ్చు.
సోమావతి అమావాస్య పూజా విధానం
సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమశివునికి గంగా జలంతో, పంచామృతాలతో అభిషేకం చేస్తే, విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. వ్యాస మహర్షి రచించిన శివ పురాణం ప్రకారం సోమావతి అమావాస్య రోజు పుణ్యనదుల్లో స్నానం ఆచరించినవారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుందని తెలుస్తోంది.
సోమావతి అమావాస్య రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం
- సోమావతి అమావాస్య రోజున రావిచెట్టుకు, శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది.
- రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. వీలు కాని వారు శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది.
- శివకేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.
- సోమావతి అమావాస్య రోజు ఇంటికి ఈశాన్య దిక్కులో, సాయం సంధ్య వేళ ధనలక్ష్మి దేవి ప్రీతి కోసం ఆవునేతితో దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరం వేసి నమస్కరించుకుంటే దరిద్రం పోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
- సోమావతీ అమావాస్య నాడు అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్య ఫలం లభిస్తుందని విశ్వాసం.
కుటుంబ ఐక్యత కోసం ఇలా చేయండి!
సోమవతి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి, కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది. శివ పురాణంలో సూచించిన ఈ పరిహారాలు చేయడం వలన ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. - ఓం నమః శివాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.