Central Govt Life Insurance Policies in Banks : ఏదైన బ్యాంకులో మీకు పొదుపు ఖాతా ఉందా? ఒకవేళ ఉంటే మీకు రెండు జీవిత బీమా పథకాలు అమలవుతున్నాయా? లేదా మీరు ఎప్పుడైనా బ్యాంకులో జీవిత బీమా పథకాలు గురించి అడిగి తెలుసుకున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు రకాల సామాజిక భద్రత జీవిత బీమా పథకాలను అమలు చేస్తోంది. అయితే దీనిపై సాధారణ ప్రజలకు అవగాహన లేకపోవడంతో లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న ప్రతి ఖాతాదారుడి నుంచి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకం కింద కేవలం రూ.20 చొప్పున ప్రీమియం తీసుకుని రూ.2 లక్షల జీవితబీమా కల్పిస్తున్నారు.
ఏదైనా ప్రమాదం జరిగి దాని వల్ల ఖాతాదారుడు మరణిస్తే ఆ సమాచారాన్ని బ్యాంకుకు నామినీ తెలియజేసిన వెంటనే జీవితబీమా పరిహారం కింద రూ.2 లక్షలు చెల్లిస్తారు. రాష్ట్రంలో మొత్తం 6,520 బ్యాంకు శాఖల్లోని 174.71 లక్షల మంది నుంచి ఈ పథకం కింద ప్రీమియం వసూలు చేస్తున్నట్లు తాజాగా బ్యాంకులు కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. కానీ ఏడాదికోసారి తన ఖాతా నుంచి రూ. 20 ప్రీమియం సొమ్ము మినహాయించుకోవాలని ఖాతాదారుడు బ్యాంకుకు రాతపూర్వకంగా సంతకం చేసి విజ్ఞప్తి చేయాలి. కొన్ని బ్యాంకు శాఖలు సైతం ఈ లేఖను ప్రతి సంవత్సరం తీసుకునేలా నిబంధనను అమలు చేస్తున్నాయి.
ఒకవేళ ఖాతాదారుడు బ్యాంకుకు ఆ లేఖ ఇవ్వడం మరిచిపోతే, ప్రీమియం మినహాయింపు, బీమా ఆగిపోతున్నాయి. మరికొన్ని బ్యాంకుల్లో ఒకసారికే లేఖ తీసుకుని ‘ఆటో డెబిట్’ కింద ఏటా ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటున్నాయి. దీనివల్ల ఖాతాదారుడు ఏటా బ్యాంకుకు లేఖ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఖాతాదారులు తమ బ్యాంకులో ఈ పథకం వివరాలు అడిగి తెలుసుకుని క్రమం తప్పకుండా కొనసాగిస్తే ఎంతో ప్రయోజనకరం.
జీవనజ్యోతికి ప్రీమియం ఎక్కువని
సాధారణంగా లేదా ఇతర కారణంతో ఖాతాదారుడు చనిపోయినా రూ.2 లక్షల పరిహారంగా ఇచ్చేందుకు ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)ను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే రాష్ట్రంలో అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం 78.61 లక్షల మంది మాత్రమే ఈ పథకంలో చేరి ప్రీమియం చెల్లిస్తున్నారు. దీనికి సంవత్సరానికి చెల్లించాల్సిన ప్రీమియం బ్యాంకును ఆధారంగా రూ.450 నుంచి రూ.500 వరకూ ఉండడంతో చాలామంది దీనిలో చేరడం లేదు.
ప్రచారంపై పలు బ్యాంకుల నిర్లక్ష్యం : నిరుపేదలు, దిగువ మధ్య తరగితి కుటుంబ యజమానులు మరణించిన సందర్భాల్లో ఆ కుటుంబాలకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించేలా ఈ రెండు పథకాలను కచ్చితంగా అమలు చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులకు గట్టి సూచనలిచ్చింది. వీటితోపాటు అటల్ పింఛన్ యోజన పథకంపై కూడా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశాలిచ్చింది. ఖాతాదారుడు చనిపోతే జీవిత బీమా పరిహారం కింద ఈ రెండు పథకాల నుంచి వెంటనే రూ.4 లక్షలు వేగంగా చెల్లించాలని స్పష్టం చేసింది.
ఎలాంటి డిపాజిట్ తీసుకోకుండా జీరో బ్యాలెన్స్‌తోనే పేదల కోసం తెరిచే జన్‌ధన్ యోజన బ్యాంకు ఖాతాలున్న అందరికి వీటిపై అవగాహన కల్పించి ప్రీమియం వసూలు చేయాలని బ్యాంకులకు కేంద్రం సూచనలు చేసింది. కానీ రాష్ట్రంలో 121.52 లక్షల మంది పేదలకు జన్‌ధన్ యోజన బ్యాంకు ఖాతాలుంటే అందులో 78.61 లక్షల మంది మాత్రమే ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజనలో ఉన్నారు. పీఎం ఉజ్వల, ఉపాధి హామీ, పీఎం కిసాన్ వంటి పథకాల లబ్ధిదారులతోపాటు స్వయం సహాయక మహిళాసంఘాల వారికి ఈ జీవిత బీమాను బ్యాంకులు కల్పించాలి. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం వీటిపై పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఉదాహరణకు ఓ ప్రైవేట్ బ్యాంకులో 9 లక్షల 18 వేల 786 మందికి సురక్ష బీమా యోజన అమలైతే కేవలం 57,878 మంది మాత్రమే పీఎంజేజేబీవైలో ఉన్నారు.
Pradhan Mantri Suraksha Bima Yojana PMSBY : రూ.20లకే రూ.2లక్షల ప్రమాద బీమా.. చేరండిలా!