తెలంగాణ

telangana

ETV Bharat / health

30 ఏళ్లు దాటిన వారికి బిగ్ అలర్ట్ - ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ దెబ్బతింటున్నట్టే! - Liver Cirrhosis Symptoms - LIVER CIRRHOSIS SYMPTOMS

Liver Cirrhosis Symptoms : మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి.. కాలేయం. అది బాగుంటేనే మనకు ఆరోగ్యం. కానీ.. అనారోగ్యకర అలవాట్లతో దాన్ని చేజేతులా దెబ్బ తీసుకుంటారు చాలా మంది. 30 ఏళ్లు దాటిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే.. లివర్ ప్రమాదంలో ఉందని అనుమానించాలంటున్నారు నిపుణులు.

Warning Signs Of Cirrhosis Of Liver
Liver Cirrhosis Symptoms (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 11:37 AM IST

Warning Signs Of Cirrhosis Of Liver : మారిన జీవనశైలి కారణంగా నేటి రోజుల్లో రకరకాల లివర్ సమస్యలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. వీటిని ప్రారంభ దశలోనే గుర్తించకపోతే.. ప్రాణాంతకంగా మారే ప్రమాదమూ ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

లివర్ సిరోసిస్..

కాలేయం చాలా మెత్తగా ఉండే అవయవం. ఇన్‌ఫ్లమేషన్‌ ఏర్పడినపుడు లివర్(Liver)ఉబ్బిపోతుంది. అదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే.. రక్తకణాలు దెబ్బతింటాయి. కాలేయం రాయిలా గట్టిగా మారిపోతుంది. దీంతో.. అది చేయాల్సిన పనులు చేయలేకపోతుంది. చివరికి కాలేయం పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది. ఈ పరిస్థితినే లివర్ సిరోసిస్ అంటారని లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ నవీన్‌ పోలవరపు చెబుతున్నారు. అయితే.. ఈ ప్రమాదకరమైన మొదలైనప్పుడు.. శరీరంలో లక్షణాలు పెద్దగా కనిపించవని అంటున్నారు. సమస్య తీవ్రం అవుతున్నకొద్దీ లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. అవేంటంటే..

లక్షణాలు :

  • త్వరగా అలసిపోవటం
  • ఆకలి తగ్గటం
  • చర్మం పాలిపోవడం, దురదగా అనిపించడం, కమిలిపోవడం
  • మూత్రం ముదురు రంగులోకి మారడం
  • కడుపు, కాళ్లు ఉబ్బడం
  • కొందరికి వికారంగా అనిపిస్తుంది
  • కొన్నిసార్లు మెదడు మొద్దుబారొచ్చు
  • మతిమరుపు ఆరంభం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు.

డేంజర్ : కంటిలో ఇలా.. ఒంటిపై అలా - ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్టే!

కారణాలేంటంటే?

  • లివర్ సిరోసిస్ ప్రాబ్లమ్ తలెత్తడానికి అనేక అంశాలు దోహదం చేస్తుంటాయంటున్నారు డాక్టర్ నవీన్. అలాంటి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుంటే ముందుగానే జాగ్రత్త పడటానికి వీలుంటుందని సూచిస్తున్నారు.
  • అతిగా మద్యం(Alcohol)తాగటం వల్ల కాలేయం ఉబ్బుతుంది. కాలేయానికి కొవ్వు పడుతుంది. ఇది చివరికి లివర్ సిరోసిస్​కు దారితీస్తుందంటున్నారు. కాబట్టి, వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.
  • కొంతమందికి ఆల్కహాల్ తాగే అలవాటు లేకపోయినా లివర్​కి కొవ్వు పట్టొచ్చు(నాన్‌ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌). దీనికి కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు. కానీ.. అధిక బరువు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు గలవారికి వచ్చే ఛాన్స్ ఎక్కువ అంటున్నారు వైద్యులు.
  • హెపటైటిస్‌ సి ఇన్‌ఫెక్షన్‌ 6 నెలలు, అంతకన్నా ఎక్కువకాలం కొనసాగితే దీర్ఘకాల ఇన్‌ఫెక్షన్‌గా భావిస్తారు. ఇదీ లివర్ గట్టిపడటానికి దారితీయొచ్చని చెబుతున్నారు. కాబట్టి, హైపటైటిస్ సి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
  • కాలేయం నుంచి పిత్తాశయానికి పైత్యరసాన్ని తీసుకెళ్లే నాళాల సమస్యలూ కాలేయ జబ్బుకు దారితీయొచ్చంటున్నారు.
  • నొప్పులు తగ్గటానికి, క్షయ చికిత్సలో వాడే కొన్ని రకాల మందులు కాలేయాన్ని దెబ్బతీసే అవకాశముందని చెబుతున్నారు. అలాగే కొన్నిరకాల యాంటీబయాటిక్స్, కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులు కూడా కాలేయానికి విఘాతం కలిగించొచ్చంటున్నారు.
  • కాబట్టి.. డాక్టర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు వాడుతున్న మందుల గురించి వివరించాలని చెబుతున్నారు. అదేవిధంగా.. కొత్త మందులు వాడినప్పుడు అలసటగా అనిపించినా, వికారంగా ఉన్నా, శరీరం దురద పెడుతున్నా, మొత్తంగా ఏదో బాగా లేదని అనిపించినా వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

ఎలా నిర్ధరించాలంటే?

మీలో పైన పేర్కొన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అప్పుడు కాలేయ సామర్థ్య పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా లివర్ సిరోసిస్​ను నిర్ధరిస్తారు. అవసరమైతే లివర్ నుంచి చిన్న ముక్కను బయటకు తీసి పరీక్షిస్తారు.

చికిత్స విధానమిలా..

ముందుగా లివర్ సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. కాపాడుకునే స్థితిలో ఉందో లేదో నిర్థారించుకోవాలి. ఎందుకంటే.. సిర్రోసిస్‌ వచ్చిన తర్వాత ఏం చేయలేం. కాబట్టి రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు వాడాలి. వ్యాయామం చేయాలి. ఒకవేళ 80 శాతం కాలేయం పాడయినా బాగు చేయవచ్చు. ఏదేమైనప్పటికీ ముందుగా గుర్తించినట్లయితే ఏ సమస్య రాకుండా చర్యలు తీసుకోవచ్చని సూచిస్తున్నారు డాక్టర్ నవీన్.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మందు బాబులకు అలర్ట్ - లివర్​ దెబ్బతినొద్దంటే ఆల్కహాల్ ఆ లిమిట్ దాటొద్దంట!

ABOUT THE AUTHOR

...view details