Can You Drink Alcohol While Taking Antibiotics? :'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అని తెలిసినా.. చిన్నా పెద్దా తేడా లేదు మందు తాగేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే మద్యానికి అడిక్ట్ అయిన కొంతమంది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కూడా మందులు వాడుతూనే ఆల్కహాల్ తీసుకుంటుంటారు. వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్‌ను పట్టించుకోకుండా.. ఒకట్రెండు పెగ్గులేగా ఏం కాదులే అనుకుంటారు. కానీ.. మందులు వాడుతూ ఆల్కహాల్‌ను తీసుకుంటే మాత్రం తీవ్ర దుష్ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ కొన్ని మందులు వాడుతూ తాగడం మరింత ప్రమాదకరమని చెబుతున్నారు. ఆ మందులేంటి? అవి వేసుకుంటూమద్యం(Alcohol) తాగితే బాడీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యులు ఎక్కువగా యాంటీబయాటిక్స్(Antibiotics) మందులు రాస్తుంటారు. అయితే.. ఇవి వాడే సమయంలో మద్యం తాగొచ్చా? అంటే.. వైద్య నిపుణుల నుంచి 'నో' అనే సమాధానమే వినిపిస్తోంది. యాంటీ బయాటిక్స్ తీసుకునే సమయంలో అవి తీసుకోవాల్సిన గడువు ముగిసే వరకు మద్యపానానికి దూరంగా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు.
ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్యసమస్యతో బాధపడుతూ యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఆల్కహాల్ సేవిస్తే.. ఆ మందుల ప్రభావం పనిచేయకుండా పోతుందంటున్నారు. అంతేకాదు.. శరీరం ఆ వ్యాధితో పోరాడే శక్తిని కోల్పోతుందని వైద్యులు చెబుతున్నారు. బాడీలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి వచ్చిన జబ్బు నుంచి కోలుకునే అవకాశాలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు.
బిగ్ అలర్ట్ : మహిళలు మందు తాగితే - ఏం జరుగుతుందో తెలుసా? - Alcohol Health Risks in Women
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు మద్యం తాగితే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట. కడుపునొప్పి, వికారం, తలనొప్పి, ఛాతీ బిగుతు, శ్వాస ఆడకపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందట. కాబట్టి ఎవరైనా సరే యాంటీబయాటిక్స్ వాడుతున్న టైమ్‌లో వీలైనంత వరకు మద్యానికి దూరంగా మంచిది అంటున్నారు నిపుణులు.
2019లో 'జర్నల్ ఆఫ్ యామికాన్ మెడిసిన్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు మద్యం సేవించే వ్యక్తులకు వికారం, వాంతులు, అతిసారం వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్ఏలోని బ్రిఘామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ డబ్ల్యూ కెన్నెడీ పాల్గొన్నారు. యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు ఆల్కహాల్ తాగడం అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. యాంటీబయాటిక్స్ వేసుకోవడం ఆపేశాక.. ఎప్పటి నుంచి మద్యం తాగాలనే అనే ప్రశ్న మందుబాబులకు వస్తుంది. "నేషనల్ హెల్త్ సర్వీస్" ప్రకారం.. యాంటీబయాటిక్స్ కోర్సు ముగిసిన వెంటనే కాకుండా చివరి మందు వేసుకున్నాక కనీసం 48 నుంచి 72 గంటల తర్వాత ఆల్కహాల్ తీసుకోవచ్చట. అంటే.. కనీసం మూడు రోజుల వరకూ ఆగి ఆ తర్వాత మద్యం తాగితే దాని ప్రభావం మందులపై ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. అలాగని మద్యం అతిగా తాగితే ఆరోగ్యానికి ప్రమాదమనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : మందు తాగితే షుగర్ పెరుగుతుందా? - నిపుణుల సమాధానమిదే! - problems of diabetes drink alcohol