Pineapple for Sugar Patients is Good or Not: ప్రస్తుత కాలంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే ఒక్కసారి షుగర్ ఎటాక్ అయితే ఆరోగ్యం, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది తినాలన్నా కూడా దాని గురించి తెలుసుకొని, దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందా ? అనేది తెలుసుకుని తినాలి. ముఖ్యంగా పండ్లను తినే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలోనే డయాబెటిస్ బాధితులు పైనాపిల్ తినొచ్చా? తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయా? అనే డౌట్ ఉంటుంది. మరి దీనికి నిపుణులు సమాధానమేంటో ఈ స్టోరీలో చూద్దాం..
మన శరీరానికి ఆరోగ్యం ఇచ్చే పండ్లలో పైనాపిల్ ఒకటి. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాపర్, డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారికి పైనాపిల్ అద్భుతంగా పనిచేస్తుంది. పైనాపిల్ కడుపులో మంటను తగ్గిస్తుంది. అయితే పైనాపిల్ డయాబెటిస్ బాధితులు తినొచ్చా? అంటే పరిమిత మోతాదులో తినొచ్చు అని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు.
డయాబెటిస్ బాధితులు రెండు ముక్కలకు మించకుండా పైనాపిల్ తినవచ్చని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే పైనాపిల్ పండులో గ్లూకోజ్, సుక్రోజ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనిని అధిక మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు రోజుకి ఒకటి లేదా రెండు ముక్కలు తినడం మంచిది అంటున్నారు. అయితే విడిగా తినడం కన్నా భోజనంతో కలిపి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం తక్కువని అంటున్నారు.
2019లో డయాబెటిస్ రీసెర్చ్ అండ్ క్లినికల్ ప్రాక్టీస్ జర్నల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం మధుమేహం ఉన్నవారు భోజనంతో పాటు రెండు ముక్కలు పైనాపిల్ తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరగలేదని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నేషనల్ తైవాన్ యూనివర్సిటీ హాస్పిటల్(National Taiwan University Hospital)లో ఇంటర్నల్ మెడిసిన్ విభాగానికి చెందిన ఫిజీషియన్ డాక్టర్ Yi-Jung Lai పాల్గొన్నారు. లిమిట్ ప్రకారం పైనాపిల్ తింటే షుగర్ లెవల్స్ పెరగవని పేర్కొన్నారు. అంతకుమించి పైనాపిల్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయంటున్నారు. ఫలితంగా అది శరీరంలోని ఇతర అవయవాలపైన ప్రభావాన్ని చూపించి, కిడ్నీలు, గుండె వంటి శరీర అవయవాలు దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. కాబట్టి జాగ్రత్త అవసరం అంటున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.