తెలంగాణ

telangana

By ETV Bharat Health Team

Published : 20 hours ago

ETV Bharat / health

కోడి గుడ్లు తిని బోర్ కొడుతోందా?- అయితే, ఓసారి ఈ ఎగ్స్​ను ట్రై చేయండి - Different Types of Eggs

Different Types of Eggs : గుడ్డు అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కోడి. కానీ కోడి గుడ్డు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల ఎగ్స్​ ఉన్నాయి. ఆయా దేశాల్లో వాటికి మంచి గిరాకి ఉంటుంది. అలాగే ఆ గుడ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Different Types of Eggs
Different Types of Eggs (ETV Bharat)

Different Types of Eggs : కోడిగుడ్లలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయని మనకు తెలుసు. మాములుగా మన దగ్గర ఎక్కువగా కోడిగుడ్లను మాత్రమే ఉపయోగిస్తారు. కానీ, పలు దేశాల్లో ఇతర పక్షుల నుంచి వచ్చే గుడ్లను కూడా ఆహారంలో భాగం చేసుకుంటారని మీకు తెలుసా. ఈ క్రమంలో అలాంటి కొన్ని ఎగ్స్‌ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బాతు గుడ్లు :బాతు గుడ్డు సైజ్ మాములు కోడి గుడ్డు లాగానే ఉంటుంది. అయితే, బాతుగుడ్డులో పచ్చసొన కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే ఈ గుడ్డు పెంకు కొంచెం మందంగా ఉండటం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఇవి రుచిగా ఉండడంతో పాటుగా సాధారణ గుడ్డు కంటే ఎక్కువ పోషకాలను అందిస్తాయి. ఇందులో బీ కాంప్లెక్స్‌ విటమిన్‌తో పాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీనిని బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండచ్చంటున్నారు. ఈ బాతు గుడ్లు కొన్ని స్టోర్స్‌లతో పాటు ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్నాయి.

ఈము గుడ్డు :ఈము పక్షి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దీనికి ప్రపంచంలోనే రెండో ఎత్తైన పక్షిగా గుర్తింపు ఉంది. ఈము గుడ్లకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంటుందట. దీని ఆకారంతో పాటుగా ఇందులో ఉండే పోషకాలే అందుకు కారణమని నిపుణులు తెలుపుతున్నారు. ఇది చూడడానికి పెద్ద సైజు అవకాడోలాగా ఉంటుంది. ఈము గుడ్డు దాదాపుగా 10 కోడిగుడ్లతో సమానంగా ఉంటుంది. ఈ ఎగ్‌ను ఎక్కువగా ఆమ్లెట్‌ చేసుకుని తినడానికి ఇష్టపడుతారు. మన దగ్గర కూడా కొన్ని ప్రాంతాల్లో ఈము గుడ్లు లభిస్తుంటాయి. అయితే వీటి ధర మాత్రం ఎక్కువగానే ఉంటాయి.

గూస్ గుడ్డు : సాధారణ గుడ్డు కంటే గూస్ గుడ్డు రెట్టింపు సైజ్​లో ఉంటుంది. గూస్‌ పక్షులు బాతుల మాదిరిగానే ఉంటాయి. అయితే వీటి సంఖ్య చాలా తక్కువ. ఒక్క గూస్‌ పక్షి సంవత్సరానికి 35 నుండి 40 గుడ్లను మాత్రమే పెడుతుందట. కోడిగుడ్డు కంటే రెట్టింపు పరిమాణంలో ఉండే ఈ గుడ్లలో పోషకాలు సుమారు నాలుగు రెట్లు అధికంగా ఉంటాయి. రుచి కూడా అంతే బాగుంటుంది. కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఈ గుడ్లు లభిస్తున్నాయి.


క్వాయిల్ గుడ్డు :క్వాయిల్ ఎగ్స్‌ను జపాన్‌ ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. ఈ గుడ్డు సాధారణ కోడిగుడ్డుతో పోల్చితే చాలా చిన్నగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా తింటుంటారు. దాదాపు నాలుగు గుడ్లు ఒక్క కోడిగుడ్డుతో సమానగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాల విషయానికి వస్తే దాదాపు కోడిగుడ్డు లాగానే ఉంటాయని నిపుణలు చెబుతున్నారు. అయితే దీని పెంకు కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకోసమే వీటిని ఎక్కువసేపు ఉడకబెడుతుంటారు. ఇవి మన దగ్గర కూడా వివిధ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో ఈ గుడ్లు లభ్యమవుతున్నాయి.

సీగల్ ఎగ్స్ : యూరప్ దేశాల్లో సీగల్ ఎగ్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి సంవత్సరంలో మూడు నుంచి నాలుగు వారాల పాటు మాత్రమే లభిస్తాయి. అందుకోసమే వీటికి ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. యూకేలోని ఆరు ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయట. సీగల్‌ పక్షుల నుంచి వచ్చే ఈ గుడ్లను సేకరించాలంటే అక్కడి ప్రభుత్వాలతో ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే దీని ధర ఎక్కువగా ఉంటుంది. అయితే, ధరకు తగ్గట్టు ఇందులో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయని నిపుణలు చెబుతున్నారు.

ఆస్ట్రిచ్‌ పక్షి గుడ్డు : ప్రపంచంలోనే పెద్దదై పక్షి ఏదంటే వెంటనే గుర్తు వచ్చేది ఆస్ట్రిచ్‌ పక్షి. ఇవి ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో కనిపిస్తుంటాయి. ఈ పక్షి సైజుకు తగ్గట్టే దాని గుడ్డు కూడా ఉంటుంది. ఈ గుడ్డు ఒక్కోటి సుమారు రెండు కేజీల వరకు ఉంటుంది. ఒక్క ఆస్ట్రిచ్‌ గుడ్డు దాదాపు 24 కోడిగుడ్లతో సమానం అని నిపుణులు చెబుతున్నారు. సాధారణ కోడిగుడ్డుతో పోల్చితే ఇది 20 రెట్లు మందంగా ఉంటుంది. అందుకే ఇది అంత సులభంగా పగలదు. ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయంటున్నారు నిపుణులు.

NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నల్ల మిరియాలలో కల్తీ జరిగిందని డౌట్​గా ఉందా?- ఈ చిన్న ట్రిక్​తో ఈజీగా కనిపెట్టండి - Black Pepper Adulteration Test

విటమిన్స్ డెఫిషియన్సీతో ఇబ్బంది పడుతున్నారా?- అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..! - IMMUNITY BOOSTING VITAMINS

ABOUT THE AUTHOR

...view details