Body Odour Can Be A Sign of Diabetes :మధుమేహం వచ్చిందో లేదో అనే విషయం రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది. కానీ.. శరీరం నుంచి వచ్చే స్మెల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి.. శరీరం నుంచి వచ్చే దుర్వాసనలకు మధుమేహానికి(Diabetes) సంబంధమేంటి? వాటిని ఎలా గుర్తించాలి? ఒకవేళ మధుమేహం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చెడు వాసనలకు కారణమేమిటంటే?
రక్తంలోని చక్కెరను శక్తిగా ఉపయోగించడం కోసం బాడీలో తగినంత ఇన్సులిన్ అవసరం. అది కావాల్సినంత లేనప్పుడు షుగర్ సమస్య తలెత్తుతుందంటున్నారు నిపుణులు. అప్పుడు లివర్.. ఇంధనం కోసం కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. అది కీటోన్స్ అనే యాసిడ్స్‌ను రిలీజ్ చేస్తుంది. అయితే.. చాలా కీటోన్స్ వేగంగా రిలీజ్ అవ్వకుండా రక్తం, మూత్రంలో నిల్వ ఉండి, ప్రమాదకర స్థాయికి చేరతాయి. కాలేయం లోపల జరిగే ఈ ప్రతిచర్య ఫలితంగా.. రక్తం ఆమ్లంగా మారుతుంది. అప్పుడు అది మొత్తం మూడు రకాల వాసనలను రిలీజ్ చేస్తుందంటున్నారు. ఇవి చెమట, శ్వాస ద్వారా బయటకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలోని అధిక స్థాయి కీటోన్‌లను సూచించే ఈ వాసనలు ఎలా ఉంటాయంటే?
- పండ్ల వాసనతో కూడిన శ్వాస వస్తుంది.
- మలం లాంటి చెడు శ్వాస వస్తుంది. ఇది దీర్ఘకాలిక వాంతులు, పేగు సమస్యల వల్ల కూడా కావొచ్చంటున్నారు నిపుణులు.
- అమోనియా వంటి వాసనతో కూడిన శ్వాస వస్తుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక కిడ్నీ వైఫల్యం ఉన్నవారిలో కనిపిస్తుంది.
- మధుమేహం వచ్చిన వారిలో శ్వాస వాసన కాకుండా ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..
- నీరసం
- అధిక మూత్రవిసర్జన
- తీవ్రమైన శ్వాసలు
- వాంతులు
- వికారం
- కడుపులో నొప్పి
- బరువు తగ్గడం
- చెమటలు పట్టడం
2019లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. డయాబెటిక్ కీటోయాసిడోసిస్ ఉన్న రోగులలో అధిక మూత్ర విసర్జన, అధిక దాహం అత్యంత సాధారణ లక్షణాలుగా కనుగొన్నారు. ఈ పరిశోధనలో డాక్టర్ జాన్ డో పాల్గొన్నారు. డయాబెటిక్ కీటోయాసిడోసిస్ ఉన్నవారిలో శరీరం నుంచి కొన్ని దుర్వాసనలతో పాటు అధిక మూత్రవిసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.