Curd Reduces Lung Cancer Risk : ప్రస్తుత కాలంలో మనం ఆరోగ్యం పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అనేక రకాల వ్యాధులు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇలా జబ్బులు రావడానికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, మందు తాగడం వంటివి ప్రధాన కారణాలనిఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ చేయడం వల్ల ప్రధానంగా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. అయితే.. కొంత మందికి స్మోకింగ్ అలవాటు లేకపోయినా కూడా ఈ క్యాన్సర్ వస్తుంది.
పొగతాగే వారి పక్కన ఉండడం.. కాలుష్య కాసారాల్లో జీవనం సాగించడం.. జీవనశైలిలో మార్పుల వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వస్తుందని నిపుణులంటున్నారు. అయితే.. పెరుగు తినడం వల్ల లంగ్ క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చు అని కొందరు భావిస్తుంటారు. మరి.. ఇది నిజమేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
ముప్పును తగ్గించుకోవచ్చు!
చాలా మంది భోజనం చేసిన తర్వాత చివరలో.. పెరుగుతో అన్నం తినకుండా ఉండలేరు. అయితే.. పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. రోజూ పెరుగు తినడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. దీనిపై పలు పరిశోధనలు కూడా జరిగాయి.
2017లో "European Journal of Cancer Prevention" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రోజుకు 50 గ్రాముల పెరుగు (సుమారు 1/2 కప్పు) తినే వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ మెడిసిన్ కు చెందిన 'డాక్టర్ లిన్ గావో' పాల్గొన్నారు. రోజూ పెరుగు తినడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.