తెలంగాణ

telangana

ETV Bharat / health

'మెట్లు ఎక్కితే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువ'- రోజు ఎన్ని ఎక్కాలో తెలుసా? - STAIR CLIMBING IMPROVE HEART HEALTH

-మీరు ప్రతి రోజు మెట్లు ఎక్కుతున్నారా? -గుండెతో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు!

Climbing Stairs Good for Health
Climbing Stairs Good for Health (Getty Images)

By ETV Bharat Health Team

Published : Jan 1, 2025, 3:42 PM IST

Climbing Stairs Good for Health:ఆరోగ్యంగా జీవించాలంటే శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన శరీరంలోని అవయవాలలో గుండె అత్యంత ప్రధానమైనది. అయితే, ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవన శైలి కారణంగా చిన్నవయసులోనే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఫలితంగా దీర్ఘకాలం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ సమస్యకు అమెరికాలోని టులేన్‌ యూనివర్సిటీ పరిశోధకులు సులభమైన పరిష్కారాన్ని గుర్తించారు. Journal of the American Heart Association (JAHA)లో "Stair Climbing and Cardiovascular Disease Risk: A Cohort Study of 445,000 Adults" అనే అధ్యయనం పేరిట ప్రచురితమైంది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ప్రతి రోజు కేవలం 50 మెట్లు ఎక్కితే.. గుండె జబ్బుల ముప్పు 20 శాతం తగ్గుతుందని యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో బయటపడింది. యూకే బయోబ్యాంక్‌ ద్వారా 4.5 లక్షల మంది అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబసభ్యుల ఆరోగ్య చరిత్ర తదితర విషయాలను సేకరించి విశ్లేషించారు. గుండె జబ్బులు వచ్చే అవకాశాలున్న వ్యక్తులు.. ప్రతి రోజు మెట్లు ఎక్కడం వల్ల ఆ ముప్పు తగ్గినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇదే కాకుండా అతి తక్కువ సమయంలో గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా మారాలన్నా.. శరీరంలో కీలకమైన లిపిడ్స్‌ పనితీరు మెరుగవ్వాలన్నా మెట్లు ఎక్కడం మంచి మార్గమని పరిశోధకులు వివరిస్తున్నారు. ఎక్కువగా వ్యాయామాలు చేయలేని వారు కూడా రోజు మెట్లు ఎక్కడంతో గుండెను కాపాడుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

  • అయితే, కేవలం మెట్లు ఎక్కడమే కాకుండా వ్యాయామాలు చేస్తూనే ఆహార జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవడం కూడా కీలకమేనని అంటున్నారు.
  • ఇంకా రక్తంలో చక్కెర స్థాయులు, బీపీ ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఏమైనా హెచ్చుతగ్గులుంటే డాక్టర్‌ సలహా మేరకు వాటిని అదుపు చేసుకోవచ్చని అంటున్నారు.
  • మనలో చాలా మందికి చిరుతిండ్లు, నూనె సంబంధిత పదార్థాలంటే ఇష్టం ఉంటుంది. కానీ వాటిని అధికంగా తీసుకుంటే మాత్రం బరువు పెరిగిపోయి తద్వారా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలను మితంగా తీసుకోవడం లేదా వీటిని పూర్తిగా పక్కన పెట్టేయడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
  • ఇంకా శరీరానికి తగిన పని చెప్పకుండా గంటల తరబడి ఒకేచోట కూర్చుండిపోయే వారిలో గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి శరీరానికి తగినంత వ్యాయామం అందేలా జాగ్రత్తపడాలని వివరిస్తున్నారు.
  • ఇవే కాకుండా మానసిక సమస్యలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం, యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు సహకరిస్తాయని వివరిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'విటమిన్ బీ 12 లోపంతో రక్తహీనత సమస్య'- ఈ ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందట!

పిల్లలు పుట్టడంలేదని బాధపడుతున్నారా? దంపతులిద్దరూ ఇది తాగితే సంతానం కలిగే ఛాన్స్!

ABOUT THE AUTHOR

...view details