Side Effects of Chewing Gum Eating Longer Time : కొందరు నోటి నుంచి స్మెల్ రాకుండా.. మరికొందరు ఫ్రెష్ నెస్ కోసం.. ఇంకొందరు టైమ్ పాస్ కోసం.. చూయింగ్ గమ్ నములుతుంటారు. అయితే.. నిజానికి చూయింగ్ గమ్ నమలడం నోటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా చిగుళ్ల సమస్యలను తగ్గించడానికి, దవడలను బలంగా చేయడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతారు.
అయితే, చూయింగ్ గమ్(Chewing Gum)వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దాన్ని ఎక్కువసేపు నమలడం వల్ల పలు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది అంటున్నారు. ఇంతకీ, చూయింగ్ ఎంతసేపు నమలాలి? ఎక్కువసేపు నమలడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఫ్లేవర్స్ చూయింగ్ గమ్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా డయాబెటిస్ ఉన్నవారి కోసం షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే, ఏ చూయింగ్ గమ్ అయినా ఎంతసేపు నమలాలంటే? డైలీమెయిల్ నివేదిక ప్రకారం.. గరిష్ఠంగా 15 నిమిషాలు మాత్రమే నమలడం మంచిదట. అంతకన్నా ఎక్కువ టైమ్ నమలడం దంతాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
దంతాలు దెబ్బతిన్న తర్వాత బాధపడితే నో యూజ్ - బ్రష్ చేయడం ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి!
అంతేకాదు.. చూయింగ్ గమ్ చాలా సేపు నమలడం వల్ల పళ్ల మీద ఉండే ఎనామిల్ పొర తొలగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఇది దంతాల డీమినరైజేషన్‌కు దారితీయవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా.. చూయింగ్ గమ్‌లో తీపి కోసం వాడే రసాయనాల వల్ల దంతాలకు హాని కలుగుతుందనే విషయాన్ని గమనించాలంటున్నారు. అందుకే, మీకు ఏదైనా దంత సమస్య ఉంటే చూయింగ్ గమ్ తీసుకునే ముందు సంబంధిత వైద్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
2019లో 'జర్నల్ ఆఫ్ డెంటిస్ట్రీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. రోజు 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు చూయింగ్ గమ్ నమలడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతినడంతో పాటు వాటి సున్నితత్వం పెరిగిందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ బారికి చెందిన ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్. డోనాటో డె మార్కో పాల్గొన్నారు. రోజు ఎక్కువ సేపు చూయింగ్ గమ్ నమలడం దంత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు.
కొంతమంది గంటల తరబడి చూయింగ్ గమ్ నములుతుంటారు. అలా నమలడం చిగుళ్ల సమస్యలకు కారణమవుతుందంటున్నారు. అదేవిధంగా.. ఎక్కువ సేపు గమ్ నమలడం వల్ల టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ సమస్యలతో బాధపడేవారి సమస్యలు మరింత తీవ్రమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దవడ నొప్పి వస్తుందట. అంతేకాదు.. చూయింగ్ అతిగా నమిలితే దవడకు అనుసంధానంగా ఉండే కండరాల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే - ఈ ఆహారపదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి!