Symptoms of Cherophobia :సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది. మనిషి లోపల ఎక్కడో నాటుకుపోయి.. సందర్భాన్ని బట్టి అది బయటపడుతుంది. ముఖ్యంగా ఆ భయమనేది మరింత ఎక్కువైతే అది ఫోబియాగా మారుతుంది. అలాగే.. కొంతమందిలో ఎప్పుడైనా అనుకోని సంఘటన లేదా ప్రమాదం జరిగినప్పుడు, చూసినప్పుడు అది 'ఫోబియా' లాగా మారుతుంటుంది. ఇది కూడా ఒక మానసిక సమస్యగానే చెప్పుకోవచ్చు.
ఎంత ధైర్యవంతులైనా శునకాలను చూస్తే భయపడేవారుంటారు. కొందరు నలుగురి మధ్యకు రావడానికి, మాట్లాడటానికి జంకేవాళ్లుంటారు. మరికొందరు పిడుగు శబ్దం వినిపిస్తే గజగజ వణికిపోతారు. ఇంకొందరైతే బల్లి, బొద్దింక, పాము.. ఇలా రకరకాల వాటిని చూసి భయపడేవారుంటారు. ఇవన్నీ ఒక రకమైన ఫోబియాలే! అయితే, ఇవి మాత్రమే కాదు.. 'సంతోషం' అంటే భయపడే ఫోబియా కూడా ఒకటుందని మీకు తెలుసా? అవును.. మీరు వింటుంది నిజమే! ఇంతకీ, ఆ ఫోబియా(Phobia) పేరు ఏంటి? దాని లక్షణాలేంటి? మానసిక నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఆ విచిత్రమైన ఫోబియా పేరు.. చెరోఫోబియా. ఇందులో చెరో అనేది గ్రీకు పదమైన 'చైరో' నుంచి వచ్చింది. గ్రీకు భాషలో దీనికి 'నేను సంతోషిస్తున్నానని' అర్థమట. మొత్తంగా చెరోఫోబియా అంటే.. ఆనందం లేదా సంతోషం పట్ల కలిగే భయమట. నిజానికి.. సంతోషంగా ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, కొందరు మాత్రం సంతోషంగా ఉండేందుకు భయపడతారట.
ఇందుకు గల కారణం.. సంతోషంగా కనిపిస్తే ఎక్కడ చెడు జరుగుతుందోననే భయంతో హ్యాపీగా ఉండరని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ఆనందం ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని లేదా బాధలకు గురిచేస్తుందని ఈ ఫోబియాతో భయపడేవారు నమ్ముతారంటున్నారు నిపుణులు. అందుకే దీనిని 'చెరోఫోబియా'గా పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు.
స్టేజ్ పైన ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే గుడ్ స్పీకర్ అయిపోతారు!
2012లో 'జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. చెరోఫోబియా ఉన్న వ్యక్తులు ఆనందాన్ని అనుభవించే అవకాశం తక్కువగా ఉందని, సానుకూల అనుభవాలను నివారించే అవకాశం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ A&M విశ్వవిద్యాలయానికి చెందిక మానసిక శాస్త్ర నిపుణులు డాక్టర్. టాడ్ కె. కాష్డాన్ పాల్గొన్నారు. చెరోఫోబియాతో బాధపడేవారు ఆనందం ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందనే భయంతో ఉంటారని ఆయన పేర్కొన్నారు.
చెరోఫోబియా కొన్ని సంకేతాలు :
- చెరోఫోబియాతో బాధపడుతున్న వ్యక్తులు చిన్న చిన్న ఆనందాన్ని అనుభవించినప్పుడు వారు వెంటనే గిల్టీ ఫీలింగ్‌ను పొందుతారని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
- అలాగే.. తరచుగా సంతోషానికి సంబంధించిన పరిస్థితులు లేదా సంఘటనలు చెరోఫోబియాతో బాధపడేవారు అవాయిడ్ చేస్తారట.
- చెరోఫోబియాను ఎదుర్కొనే వారు సానుకూల భావోద్వేగాలను వ్యక్తపరచడంలో కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళా అలాంటి భావోద్వేగాలను వ్యక్తపరిస్తే మరుసటి క్షణంలో వారు బాధపడతారట.
- ఆనందాన్ని అనుభవించాలనే భయం.. చెరోఫోబియాతో ఇబ్బందిపడేవారిలో ఆందోళన, ఒత్తిడిని పెంచుతుందట. అందుకే.. వారు అలాంటి పరిస్థితులను నివారించడానికి ప్రయత్నిస్తారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, మానసిక నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డ్రైవింగ్ చేయాలంటే భయపడుతున్నారా? ఈ టిప్స్‌తో దూసుకెళ్లండి!