Causes Of Night Fever In Telugu : తరచూ జలుబు, జ్వరం, అలసటతో ఇబ్బంది పడుతున్నారా? ముఖ్యంగా రాత్రి వేళల్లో జ్వరం మరీ ఎక్కువై బాగా ఇబ్బంది పెడుతుందా? ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గకపోతే ఏం చేయాలి? అసలు రాత్రుళ్లే ఎందుకు జ్వరం ఎక్కువ అవుతుంది? దీని నుంచి బయటపడటానికి ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట జ్వరం చాలా అరుదుగా వస్తుండొచ్చు. కానీ దీన్ని సీరియస్‌గా తీసుకోకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. వరుసగా మూడు రోజుల కన్నా ఎక్కువ సార్లు రాత్రుళ్లు జ్వరం వచ్చిందంటే సమస్య పెద్దదైందని గుర్తించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా జరిగితే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
సాధారణంగా రాత్రి పూట హార్మోన్లు ఎక్కువ పనిచేస్తాయి. ముఖ్యంగా మెదడులోని హైపోథాలమస్ పనితీరు పెరగడం వల్ల జ్వరం ఎక్కువ అవుతుంది. ఇది మెదడులోని ఒక భాగం. హైపోథాలమస్ శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది రాత్రి పూట మరింత చురుగ్గా పనిచేసి శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతుంది. అలాగే జ్వరం అనేది జలుబు, అరుగుదల సమస్యలు, ఫ్లూ లేదా వైరల్ ఇన్ఫెక్షన్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తుంటుంది. లూపస్, హెచ్‌ఐవీ, క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రోన్స్ వంటి సమస్యలు ఉన్నవారికి రాత్రి పూట జ్వరం ఎక్కువ అవుతుంది. చాలా రకాల క్యాన్సర్స్ మొదట్లో రాత్రుళ్లు జ్వరాలతోనే ప్రారంభమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- నుదిటిపై తడిబట్ట వేసుకోవడం మర్చిపోవద్దు.
- తేలికపాటి దుస్తులు వేసుకోవాలి.
- మీరు నిద్రపోతున్న గదిలో నుంచి గాలి బయటకు వెళ్లేలా, బయట గాలి లోపలికి వచ్చేలా చక్కటి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
- రాత్రి పూట జ్వరం వస్తుందంటే పగలంతా ఎక్కువ నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి.
- వేడి నీళ్లతో స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచాలి.
- పడుకునే ముందు వేడి పాలు తాగడం లేదా గ్రీన్ టీ లాంటి హెర్బల్ పానీయాలు తాగితే మరీ మంచిది.
- శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
- పగటిపూట జ్వరం ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించి వారి సూచనల మేరకు రాత్రి పూట వేసుకోవాల్సిన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫెక్షనల్ మందులను, టీకాలను వేసుకోవడం మర్చిపోవద్దు.
ముఖ్య గమనిక :ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.