Causes Of Back Pain In Female And Treatment :మహిళలను ఎక్కువగా వేధించే సమస్య నడుం నొప్పి. మోనోపాజ్ దశ నుంచి మలి వయసు వరకు చాలామంది ఆడవారు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఈ సమస్యతో బాధపడే వారు సరిగ్గా పని చేయలేరు. అలాగే సరిగ్గా కూర్చోలేక, రాత్రిపూట నిద్రపట్టక అనేక రకాల అనారోగ్య సమస్యలకు లోనవుతుంటారు. అయితే మహిళలు నడుంనొప్పి నుంచి ఎలా రిలీఫ్ పొందాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మహిళలకు నడుం నొప్పి ఎక్కువగా రావడానికి కారణాలు
పురుషులతో పోలిస్తే మహిళలకు ఎక్కువగా నడుం నొప్పి రావడానికి కారణాల్లో మొదటిది హార్మోన్లు. పురుషుల కన్నా మహిళల్లో ఎక్కువ హార్మోన్లు విడుదలవుతాయి. మహిళల్లో విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈస్ట్రోజన్ హార్మోన్ అతిగా విడుదల అవ్వడం వల్ల ఆస్టియోఫోరోసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మహిళలు వ్యాయామం చేయకపోవడం వంటివి కూడా నడుం నొప్పికి కారణం అవుతుందని స్పెన్ సర్జన్ కృష్ణ చైతన్య తెలిపారు.
గర్భం దాల్చడం వల్ల
మహిళల్లో చాలామంది గర్భధారణ తర్వాత నడుంనొప్పిని ఎదుర్కొంటారు. దీనికి కారణం పొట్టలో పెరిగే శిశువు. అప్పటి దాకా నడుం మీద కేవలం తమ శరీర బరువు మాత్రమే ఉండగా, గర్భధారణ తర్వాత పొట్టలోని శిశువు బరువును నడుం మోయాల్సి ఉంటుంది. దీని వల్ల కూడా నడుం నొప్పి సమస్యను వచ్చే అవకాశం ఉందని స్పెన్ నిపుణులు కృష్ణ చైతన్య చెబుతున్నారు.