Cause Of Feeling Sleepy All Time :కొంత మంది రాత్రంతా బాగా నిద్రపోయినా.. ఉదయాన్నే నిద్ర వస్తుందంటారు. ఆఫీస్‌కు వెళ్లి వర్క్ చేస్తున్నా, ఇంట్లో ఉండి వివిధ పనులు చేస్తున్నా శరీరం సహకరించక ఎప్పుడు నిద్రపోదామా అని ఎదురు చూస్తుంటారు. మీకు కూడా ఇలానే రోజంతా మగతగా ఉన్నట్లు అనిపిస్తోందా ? అయితే, ఈ స్టోరీని తప్పకుండా చదవండి. ఎందుకంటే, ఇలా రోజంతా అలసటగా అనిపించడానికి కొన్ని అనారోగ్య సమస్యలు కారణమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఎక్కువ ఒత్తిడి :అధిక ఒత్తిడి నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే..రాత్రి నిద్రపోయే సమయంలో ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మనల్ని మరింత చురుకుగా ఉంచి, నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుందని.. తద్వారా ఉదయం పూట అలసటగా ఉంటామని ఆరోగ్య నిపుణులంటున్నారు.
2017లో 'జర్నల్ స్లీప్ మెడిసిన్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అధిక ఒత్తిడి.. నిద్రలేమి, స్లీప్ ఫ్రాగ్మెంటేషన్‌కు దారి తీస్తుందని పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల రాత్రి సరిగ్గా నిద్ర పట్టక, ఉదయం మగతగా ఉంటుందని పరిశోధనలో కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని మేరీలాండ్‌లోని బాల్టిమోర్‌లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన 'డాక్టర్ కెరోల్ లిండెన్' పాల్గొన్నారు.
స్లీప్ ఆప్నియా, నిద్రలేమి :రాత్రి సరిపడా నిద్రపోయినా..ఉదయాన్నే అలసటగా ఉండటానికి.. స్లీప్ ఆప్నియా, నిద్రలేమి, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్‌లో.. కాళ్లలో ఏదో పాకుతున్నట్టు, దురద పెడుతున్నట్టు, మండుతున్నట్టు, సూదులతో పొడుస్తున్నట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల అప్రయత్నంగా కాళ్లను కదిలిస్తారు. ఇలా అదే పనిగా కాళ్లను కదిపితే.. రాత్రి నిద్ర సరిపోకా.. పగటి వేళలో మగతగా ఉంటుందని నిపుణులంటున్నారు.
ఐరన్ లోపం :మన శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయడంలో ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. బాడీలో ఇనుము శాతం తక్కువగా ఉన్నప్పుడు శరీరం తగినంత హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయదు. దీనివల్ల మన కండరాలు, కణజాలాలకు అవసరమైనంత ఆక్సిజన్ అందదు. దీంతో మనం రోజంతా అలసటగా, బలహీనంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపంతో బాధపడే మహిళలు ఎక్కువగా అలసటతో బాధపడతారని అంటున్నారు.