Cancer Signs in Body :క్యాన్సర్ రావడానికి ముందుగానే శరీరం సంకేతాలు పంపుతుందని.. ఎవరికివారు వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా గుర్తిస్తే.. ఈ వ్యాధికి చికిత్స చాలా సులభం అవుతుందని.. పూర్తిగా నయమయ్యే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కాబట్టి శరీర సంకేతాలను ముందుగానే గుర్తించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆహారం తీసుకునే సమయంలో ఈ 5 లక్షణాలను గమనిస్తే.. క్యాన్సర్ తీవ్రతరం కాకముందే గుర్తించవచ్చని చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆహారాన్ని మింగలేకపోవడం
ఆహారం తీసుకునే సమయంలో అసౌకర్యం, నొప్పి, గొంతులో ఇరుక్కున్నట్లు కొందరికి అనిపిస్తుంది. అయితే, ఈ లక్షణాలు క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చేసిన అధ్యయనంలో తేలింది. 2022లో ప్రచురితమైన "Symptoms of Cancer"(రిపోర్ట్) అనే అంశంపై చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని కనిపెట్టారు. ఫలితంగా తల, మెడ, దవడ ప్రాంతాల్లో క్యాన్సర్ కణితిలను పెరిగేలా ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కడుపులో మంట
చాలా మందిలో తరచుగా వచ్చే అజీర్తి సమస్య సాధారణమైనదే. కానీ, ఛాతీ, కడుపులో మంట, ఉబ్బరంగా అనిపిస్తూ.. ఎక్కువ నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ అన్నవాహిక క్యాన్సర్‌కు దారితీయవచ్చని చెప్పారు.
త్వరగా కడుపు నిండిన ఫీలింగ్
క్యాన్సర్‌ను గుర్తించే మరో లక్షణం త్వరగా కడుపు నిండినట్లుగా అనిపించడం. కొద్ది మోతాదులో ఆహారం తీసుకున్నా సరే.. కొందరిలో వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని.. ఇది అల్సర్ లాంటి వ్యాధుల్లో కనిపించినా క్యాన్సర్ లక్షణం కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సమయంలోనూ వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.