Be Careful of Brain Stroke in Summer :బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు.. ఎవరిలో వస్తుందో ముందుగా తెలుసుకోవడం కష్టం. అయితే.. సాధారణంగా మెదడులో ఒక ప్రాంతానికి రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల ఈ స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల హఠాత్తుగా మరణం సంభవించొచ్చు లేదా శాశ్వత వైకల్యం ఏర్పడవచ్చు. రకరకాల కారణాలతో వచ్చే ఈ ముప్పు.. ఎండల వల్ల కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీరికి స్ట్రోక్ ముప్పు ఎక్కువ :
అధిక ఉష్ణోగ్రతల కారణంగా బీపీ, డయాబెటిక్ పేషెంట్లతో పాటు మహిళలు, హై-కొలెస్ట్రాల్ ఉన్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "మెడికల్ జర్నల్ ది లాన్సెట్" ప్రకారం.. ఉబకాయం ఉన్నవారిలో డయాబెటిస్, హై-కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రెండు వ్యాధులు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు.
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు :
ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) లేదా అంతకంటే ఎక్కువకు చేరుకున్నప్పుడు.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా దీని బారిన పడే అవకాశం ఉందట.
2018లో 'నేచర్ జర్నల్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. హీట్ స్ట్రోక్‌తో బాధపడుతున్న రోగులలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 5 రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో తైవాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన డాక్టర్ చి-చెంగ్ చాంగ్ పాల్గొన్నారు. ఎండ వేడిమి కారణంగా సంభవించే హీట్ స్ట్రోక్.. బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీసే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినవారిలో మరికొన్ని లక్షణాలు :
- కంటి చూపు మందగిస్తుంది
- వాంతులు, వికారం
- కాళ్లు, చేతులు, ముఖంలో తిమ్మిర్లు
- తల తిరగడం
- మాట్లాడటంలో ఇబ్బంది
- శరీరం మొద్దుబారటం
మీ లైఫ్ స్టైల్లో ఈ 5 మార్పులు చేయండి! బ్రెయిన్ స్ట్రోక్ అసలే రాదు!! - prevent brain stroke with lifestyle
బ్రెయిన్ స్ట్రోక్ నివారణ చర్యలు, జాగ్రత్తలు :
- పైన పేర్కొన్న లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
- ఎందుకంటే.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం మొదటి గంట చాలా కీలకమంటున్నారు నిపుణులు. అలాగే పేషెంట్‌ని ఏసీ, ఎండకు దూరంగా ఉంచాలట.
- ముందస్తు జాగ్రతల్లో భాగంగా.. బీపీ ఎక్కువగా ఉంటే అదుపులో ఉండేలా చూసుకోవాలి.
- వీలైనంత వరకు ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలి.
- మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
- ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి తినకపోవడం మంచిది.
- రోజూ తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
హీట్ స్ట్రోక్ - ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి - లేదంటే ప్రాణాలకే ప్రమాదం! - Heat Stroke Prevention Tips