Best Exercises To Increase Brain Power :మతిమరుపు వస్తోందని కొందరు బాధపడుతుంటారు. గతంలో మాదిరిగా విషయాలు గుర్తుండట్లేదని మరికొందరు ఆందోళన చెందుతుంటారు. ఈ పరిస్థితికి కారణం బ్రెయిన్‌కు రెస్ట్ ఇవ్వకుండా.. సమస్యల్లో పడేసి రోస్ట్ చేయడమే అంటున్నారు నిపుణులు. అందుకే కొన్ని పనులు చేయాలని సూచిస్తున్నారు.
రీడింగ్ బుక్స్ :పుస్తకాలు చదవడం అనేది గొప్ప మానసిక వ్యాయామంగా చెబుతున్నారు నిపుణులు. ఇది జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. అందుకే.. క్రమం తప్పకుండా బుక్స్ చదవాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ ఫీలింగ్ మీకు హాయిగా అనిపిస్తుంది. దాంతో ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గిపోతాయి. అప్పుడు నాణ్యమైన నిద్ర వస్తుంది. ఆటోమేటిగ్గా బ్రెయిన్ పవర్ పెరుగుతుందంటున్నారు.
2016లో 'Journal of Neurology'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ 30 నిమిషాలు పుస్తకాలు చదివే వ్యక్తులకు అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అన్నె టెరియోన్ పాల్గొన్నారు. పుస్తకాలు చదవడం బ్రెయిన్ పవర్ పెంచడంలో చాలా బాగా తోడ్పడుతుందని అన్నె టెరియోన్ పేర్కొన్నారు.
మెడిటేషన్ : మీ బ్రెయిన్ పవర్‌ను పెంచుకోవడంలో మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ముఖ్యంగా రోజూ ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గి.. నాడీ మార్గాలు చురుగ్గా పనిచేస్తాయి. దాంతో మీ దృష్టి, పరిశీలనా నైపుణ్యాలు మెరుగుపడడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు నిపుణులు.
మీ లైఫ్ స్టైల్లో ఈ 5 మార్పులు చేయండి! బ్రెయిన్ స్ట్రోక్ అసలే రాదు!!
సంగీతం : భావోద్వేగాలు, జ్ఞాపకశక్తి, శారీరక కదలికలకు తోడ్పడే వాటితోపాటు మెదడులోని అన్ని భాగాలనూ సంగీతం ఉత్తేజితం చేస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి.. కొత్త తరహా సంగీతం వినటం, వీలైతే వాయిద్యాన్ని వాయించటం నేర్చుకోవటం మంచిదంటున్నారు నిపుణులు. ఇలా సంగీతం వినటం, సాధన చేయడం ద్వారా వినూత్న ఆలోచనలు రావడంతోపాటు మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.
బోర్డు గేమ్స్ : చదరంగం, మోనోపలీ, చెకర్స్ వంటి బోర్డు గేమ్స్ మెదడుకు పదును పెడతాయి. జ్ఞాపకాలను వెలికితీసే సామర్థ్యాన్ని పెంచుతాయి. వ్యూహాత్మకంగా ఆలోచించేలా చేస్తాయి. అలాగే.. బొమ్మలను, అంకెలను జోడించే కార్డు ఆటలు కూడా జ్ఞాపకశక్తి, ఊహాశక్తి, ఒక క్రమపద్ధతిలో ఆలోచించే నేర్పు పెరగటానికి దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. వీటితో పాటు పదవినోదం, సుడోకు వంటి పజిల్స్ పరిష్కరించటం కూడా మెదడు పనితీరును మెరుగుపరచడానికి చాలా బాగా తోడ్పడతాయంటున్నారు.
నాన్ డామినెంట్ హ్యాండ్ యూజ్ చేయడం :మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో నాన్ డామినెంట్ హ్యాండ్ యూజ్ చేయడం కూడా చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మీరు ఎక్కువగా కుడి చేయితో వివిధ పనులు చేస్తున్నట్లయితే.. ఇప్పుడు మీ ఎడమ చేతితో బ్రష్ చేయడం, తినడం, రాయడం.. వంటి రోజువారీ పనులను చేయడానికి ట్రై చేయాలని చెబుతున్నారు.
ఇవేకాకుండా.. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించడం, సోషల్ యాక్టివిటీస్లలో పాల్గొనడం ద్వారా కూడా మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇలా చేస్తే.. మీ బ్రెయిన్ పవర్ ఊహించని విధంగా పెరిగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా? - బ్రెయిన్లో ఏదో జరుగుతోందని టెన్షన్ పడుతున్నారా?? - ఇలా చేయండి!