Best Bedtime For Heart Health :ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారాలు ఎంత అవసరమో నిద్రకూడా అంతే అవసరమని చెబుతున్నారు వైద్యులు. మన ఆరోగ్యంపై నిద్ర తీవ్ర ప్రభావం చూపిస్తుందని సూచిస్తున్నారు. తగినంత నిద్రపోనట్లయితే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి అంతటి ప్రాముఖ్యం ఉన్నటువంటి నిద్ర గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం తప్పనిసరి. సరిగా నిద్రపోనట్లయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? రోజుకు ఎన్నిగంటలు నిద్రపోతే గుండె ఆరోగ్యానికి మంచిది అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
ప్రతి మనిషి తగినంత నిద్రపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. కానీ ఎప్పుడైతే నిద్ర సమయం తగ్గుతుందో అప్పుడు సమస్యలు వస్తాయి. సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రపోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఒకవేళ అంతకన్నా తగ్గితే మాత్రం ఆరోగ్యపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సలహా ఇస్తుంటారు. నిద్రలేమి వల్ల వచ్చే ఇబ్బందులు గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
'గుండె ఆరోగ్యానికి నిద్రముఖ్యం'
తగినంత సమయం నిద్రపోకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వైద్యులు ముఖర్జీ తెలిపారు. చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తుండటం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధుల బాధితులుగా మారుతున్నారని వివరించారు. నిద్ర సరిగ్గాపోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అనేక అధ్యయనాల్లో తేలిందని చెప్పారు.
'6-8 గంటల నిద్ర తప్పనిసరి'
'6 గంటల కన్నా తక్కువ, 8గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వారికి గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఎన్ని గంటలు నిద్ర అనే ప్రాతిపదికన కాకుండా ఏ సమయంలో నిద్రకు ఉపక్రమిస్తున్నారనే దానిపై కూడా అధ్యయనాలు జరిగాయి. రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల ప్రాంతంలో నిద్రపోయే వారిలో గుండె సంబంధిత సమస్యలు తక్కువగా వస్తున్నాయి. ఆ తర్వాత నిద్రించే వారిలో గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు అధ్యయనం చెబుతుంది' ప్రముఖ కార్డియాలజిస్టు ఎంఎస్ఎస్. ముఖర్జీ వెల్లడించారు.