Gum Bleeding Treatment as Per Ayurveda : ఈ రోజుల్లో చిగుళ్ల నుంచి రక్తం కారడం అనేది సాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి అని చెప్పుకోవచ్చు. కొందరికి పళ్లు తోమేటప్పుడు లేదా పుక్కిలించినప్పుడు చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అయితే, ఈ చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో మంచి ఔషధం ఉందని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి. ఆమె చెబుతున్న ఔషధ తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 80 గ్రాముల తుమ్మ బెరడు చూర్ణం
- 40 గ్రాముల కాచు
- 20 గ్రాముల పటిక చూర్ణం
- 10 గ్రాముల కర్పూరం చూర్ణం
- 5 గ్రాముల లవంగాల చూర్ణం
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెను తీసుకుని అందులో తుమ్మ బెరడు, కాచు, పటిక , కర్పూరం, లవంగాల చూర్ణం వేసుకోని బాగా కలుపుకోవాలి.
- అనంతరం శుభ్రంగా ఉన్న ఓ పలుచటి క్లాత్ తీసుకుని ఆ మిశ్రమాన్ని జల్లించుకోవాలి. (మాములు జల్లెడ కంటే మెత్తగా రావడానికి క్లాత్‌లో జల్లించుకోవాలి.) ఎందుకంటే మన పళ్లు, చిగుళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి గరకుగా ఉన్న వాటితో తోముకుంటే చిగుళ్లు, పళ్లు దెబ్బతినే అవకాశం ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు
- ఈ మిశ్రమాన్ని నీట్‌గా ఉన్న ఓ గాజు పాత్రను తీసుకొని పెట్టుకోవాలి. దీనిని ఒకసారి తయారు చేసుకుంటే సుమారు 3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఆ తర్వాత కూడా పాడవకపోయినా.. అందులోని ఔషధ గుణాలు కొద్దిగా తగ్గిపోతాయని చెబుతున్నారు.
- ఈ ఔషధాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పళ్లకు టూత్ పౌడర్‌లాగా వాడుకోవాలని వివరిస్తున్నారు
- ఇలా కాకుండా మరో విధంగా కూడా దీనిని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అందుకోసం ఈ పౌడర్‌లో కొంచెం నువ్వుల నూనె కలిపి పేస్ట్‌లాగా చేసి.. దానిని చిగుళ్లపై అప్లై చేసి మసాజ్ చేయాలి.
- కొద్దిసేపయ్యాక పుక్కిలించుకోవాలని.. ఇలా చేయడం వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్లలో ఇన్ఫెక్షన్, నోటి దుర్వాసన ఇలాంటివన్ని త్వరగా తగ్గిపోతాయని వివరిస్తున్నారు.
తుమ్మ బెరడు:చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచే గుణం తుమ్మ బెరడులో ఎక్కువగా ఉంటుంది. పళ్ల ఇన్ఫెక్షన్, చిగుళ్ల పైన ఉండే గార పోయేందుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా రక్తం కారే లక్షణాన్ని సైతం తగ్గిస్తుంది. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు తుమ్మ బెరడు ఎంతో సహాయపడుతుందని డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు.
కాచు:చండ్ర చెట్టు బెరడు నుంచి తయారు చేసింది కాచు చూర్ణం. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రక్తం కారకుండా ఎంతో సాయపడుతుందని సూచిస్తున్నారు.