Benign Prostatic Hyperplasia Effects :పురుషుల్లో మూత్రసంచి దిగువన చిన్న చిక్కుడు గింజ పరిమాణంలో ప్రొస్టేట్ గ్రంథి ఉంటుంది. మగవారిలో 50 ఏళ్ల తర్వాత ప్రొస్టేట్ సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. పురుష హార్మోన్ చర్య కారణంగా ప్రొస్టేట్ విస్తరిస్తుంది. దీనినే వైద్య పరిభాషలో "బినైన్ ప్రొస్టేటిక్ హైపర్ప్లాసియా(BPH)" అంటారు. అయితే.. ప్రొస్టేట్ గ్లాండ్ విస్తరించినా కొంతమందిలో అది మరీ ఇబ్బందికరమైన సమస్యలను తెచ్చిపెట్టదు. కానీ.. ఇంకొందరిలో మాత్రం ప్రొస్టేట్ వృద్ధి.. మూత్రాశయంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కొన్ని తీవ్రమైన మూత్రాశయ సమస్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ.. BPH వల్ల కలిగే ఆ సమస్యలేంటి? వాటిని సహజసిద్ధంగా తగ్గించుకోవాలంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ : పెరిగిన ప్రొస్టేట్ కారణంగా మూత్రాన్ని పూర్తిగా విసర్జించలేకపోతారు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుందంటున్నారు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ పి. వంశీకృష్ణ. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వైఫల్యానికి దారితీసే తీవ్రమైన కిడ్నీ(Kidney) ఇన్ఫెక్షన్స్ ప్రాణాంతకం కావొచ్చంటున్నారు.
మూత్రాశయం దెబ్బతినడం :ప్రొస్టేట్ పెరుగుదల మూత్రాశయంపై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే దాని కండరాలనూ బలహీనపరుస్తుంది. దీనికారణంగా దీర్ఘకాలంలో.. మూత్రాశయం పూర్తిగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుందంటున్నారు డాక్టర్ వంశీకృష్ణ.
మూత్రం నిలుపుదల :కొన్ని సందర్భాల్లో.. ప్రొస్టేట్ చాలా వృద్ధి చెందితే అది పూర్తిగా మూత్రం నిలుపుదలకి దారితీయవచ్చంటున్నారు. ఆ టైమ్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు.
ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల కారణంగా సంభవించే ఇతర సమస్యలు :
- రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన
- మూత్రం పోయడానికి చాలా సమయం పట్టడం
- మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట అనిపించడం
- మూత్రం ఎంతపోసినా ఇంకా ఉన్నట్టు అనిపించడం