Intermittent Fasting and Hair Growth : డైట్ విభాగంలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న పద్ధతి "ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్". ఈ పద్ధతిలో.. రోజులో కొంత సమయం మాత్రమే ఆహారం తీసుకొని, మిగతా సమయం మొత్తం ఉపవాసం ఉంటారు. ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండడంతోపాటు, కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. జీవక్రియలను మెరుగుపరచడం, బరువు తగ్గించడంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎంతో కీలకంగా పని చేస్తుందని అంటుంటారు. అయితే.. ఈ ఉపవాస విధానం ద్వారా ఆరోగ్య పరంగా పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. జుట్టు పెరుగుదలపై కొంత ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
జుట్టు పెరుగుదల నెమ్మదిస్తుందట!
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గడం వంటి పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా కూడా.. కొన్ని ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల జుట్టు కుదుళ్లలోని మూల కణాలపై ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుందని, దీనివల్ల జుట్టు పెరుగుదల నెమ్మదిస్తుందని గుర్తించారు. ఈ అధ్యయనం 'సెల్' అనే జర్నల్లో ప్రచురితమైంది. పరిశోధనలో భాగంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసిన ఎలుకల్లో జుట్టు పెరుగుదల గణనీయంగా మందగించినట్లు తేలింది. ఈ క్రమంలో మనుషులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ప్రభావం కొంత తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఉపవాస సమయంలో, కొవ్వు ఆమ్లాలు జుట్టు కుదుళ్లలోని మూల కణాల్లో పేరుకుపోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుందని.. ఇది క్రమంగా కణాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే.. ఈ ఒక్క కారణం వల్ల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మొత్తాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు.
"ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజాలున్నాయి. అయితే, జుట్టు పెరుగుదల మందగిస్తుందన్న ఒక్క కారణంతో దీనిని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, దీనిపై కొంత అవగాహన కలిగి ఉండడం మంచిది."- డాక్టర్ బింగ్ జాంగ్ (స్టెమ్ సెల్ బయాలజిస్ట్, చైనాలోని జెజియాంగ్‌లోని వెస్ట్‌లేక్ విశ్వవిద్యాలయం)
అయితే.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఏర్పడే ప్రభావాలను తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ పొక్కులకు కారణం వైరస్ - ఒక్కసారి సోకితే అంతేనట! - ఏం చేయాలంటే
"తలనొప్పి తరచూ వేధిస్తోందా? - ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి"