Benefits Of Pumpkin Seeds :గుమ్మడికాయ గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి.. రోజూ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గుతారు :గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజు టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలను తినడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే బరువు తగ్గాలనుకునేవారు వీటిని డైట్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. వీటిని కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. దీనివల్ల అతిగా తినకుండా ఉండవచ్చు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఇమ్యూనిటీ పెరుగుతుంది :గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్, ఇనుము, పొటాషియం వంటి పోషకాలు నిండి ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి హెల్దీగా ఉండేలా చేస్తాయి.
ఒత్తిడి తగ్గుతుంది :గుమ్మడి గింజల్లో ఉండే కెరొటినాయిడ్లు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే మెగ్నీషియం, జింక్ వంటివి మెదడుపై ఒత్తిడిని తగ్గించి ఆందోళనకు అడ్డుకట్ట వేస్తాయి. క్రమం తప్పకుండా స్పూన్ గుమ్మడి గింజలను తినడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే త్వరగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చక్కెర స్థాయులు అదుపులో : గుమ్మడి గింజలు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉన్నాయి. మధుమేహం వ్యాధితో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత స్పూన్ గుమ్మడి గింజలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 2018లో 'Nutrition Research' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. భోజనం చేసిన తర్వాత ఒక టీస్పూన్ గుమ్మడి గింజలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో బ్రెజిల్‌లోని యూనివర్సిడేడ్ ఫెడరల్ డి విసోసాకు చెందిన 'డాక్టర్ ఫ్లావియా జి. కాండిడో' పాల్గొన్నారు.