Man Brutally Murdered In Suryapet : కేసు పెట్టాడని కక్ష పెంచుకున్న దాయాదులు పెదనాన్న కుమారుడిని హతమార్చిన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం లక్ష్మీ తండ పంచాయతీలో చోటు చేసుకుంది. నూతన సంవత్సర వేడుకలను కుటుంబంతో పాటు ఆనందంగా గడపాలని సూర్యాపేట నుంచి కేక్ తీసుకొస్తున్న ధారవత్ శేషు అనే యువకుడిని చిన్నాన్న కుమారులు మాటువేసి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ధారావత్ శేషు అనే యువకుడు సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చిన్నాన్న వెంకన్న కుమారులతో శేషుకు గత కొంత కాలంగా భూ వివాదం ఉంది. ఇటీవల ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ వివాదంలో చిన్నాన్న వెంకన్నతో పాటు ఆయన కుమారులపై కేసులు నమోదయ్యాయి. తరచూ కోర్టు వాయిదాలకు తిరుగుతున్న దాయాదులు శేషుపై కక్ష పెంచుకున్నారు.
ఈ క్రమంలోనే నూతన సంవత్సర వేడుకల కేక్ కోసం సూర్యాపేట వెళ్లి గ్రామానికి తిరిగొస్తున్న శేషును గ్రామ శివారులో మాటువేసి ఉన్న దాయాదులు ఓ మిత్రుడి బర్త్డే వేడుకలంటూ ఆయన ఫ్రెండ్స్ ద్వారా అక్కడకు రప్పించారు. వారున్న చోటుకు చేరుకున్న శేషుపై చిన్నాన్న కుమారుడైన దీపక్ కత్తులతో దాడికి పాల్పడినట్లుగా బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మొదట తలపై దాడి చేసిన నిందితులు అనంతరం కత్తులతో పొట్టలో పొడిచినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇంతలో తేరుకున్న శేషు ద్విచక్రవాహనాన్ని విడిచిపెట్టి పరగులు తీశాడు. సమీపంలోని ఇంటిలోకి చేరుకుని నేలకూలాడు. అంతటితో ఆగని దుండగులు మళ్లీ దాడికి పాల్పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాన్ని సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
ఆ విషయం నచ్చలేదని సొంత తల్లి, నలుగురు చెల్లెళ్లను చంపిన యువకుడు!
పరువు హత్య! - ఇంటికి వస్తే ఘనంగా పెళ్లి చేస్తామన్నారు - చంపేసి పారిపోయారు!!