Benefits Of Lucky Bamboo Plant :మనం ఇంట్లో చాలా రకాల మొక్కలను పెంచుకుంటాం. కానీ మనం సరదాగా పెంచుకునే కొన్ని మొక్కలు మనకు ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని కలిగిస్తాయంటే మీరు నమ్ముతారా? కొన్ని మొక్కలు మన మానసిక, శారీరక, ఆర్థిక అంశాలపై కూడా ప్రభావం చూపుతాయని మీకు తెలుసా? అలాంటి మొక్కల్లో ఒకటైన లక్కీ బాంబూ ట్రీ గురించి మనం తెలుసుకుందాం.
లక్కీ బాంబూగా పిలుచుకునే ఈ మొక్కను ఇంట్లో లేదా ఆఫీసులో పెంచుకోవడం వల్ల అదృష్టం కలిసొస్తుందట. ఈ మొక్కను ఎక్కడ పెంచితే అక్కడ డబ్బు, అదృష్టంతో పాటు పాజిటివిటీ నిండి ఉంటుందని చైనా వాళ్లు బాగా నమ్ముతారు. నవగ్రహాల్లో ఒకటైన బుధ గ్రహానికి చెందిన మొక్క లక్కీ బాంబూ అని వారు భావిస్తారు. ఇది ఎంత పెరిగితే మన ఇంట్లో, వ్యాపారాల్లో అంత అభివృద్ధి జరుగుతుందని, నరదిష్టి లాంటి దోషాలను కూడా తొలగిస్తుందని చెప్పుకుంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇంట్లో ఈ మొక్కను పెంచుకుంటే ఇంటికి అదృష్టం కలిసి వస్తుందట. అంతే కాదు ఈజీగా పెంచుకోగలిగే ఈ మొక్క ఇంటిని లేదా ఆఫీసులు అందంగా, ఆకర్షణీయంగా మార్చేందుకు బాగా ఉపయోగపడతుంది. అయితే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయట. లక్కీ బాంబూ మొక్క పచ్చదనంతో పాటు తన చుట్టు పక్కల వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా మార్చడంలో తోడ్పడుతుందట. ఇవే కాకుండా లక్కీ బ్యాంబు ట్రీతో కలిగే మరిన్ని లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
సులువుగా పెంచుకోవచ్చు
లక్కీ బాంబూ ట్రీ అనేది చాలా తక్కువ మెయింటెనెన్స్ కలిగిన మొక్క. మీరు ఎంత బిజీగా ఉన్నా దీన్ని అంత శ్రద్ధగా పట్టించుకోకపోయినా ఇది చక్కగా పెరుగుతుంది. పలు రకాల ఉష్ణోగ్రతలు, నీటి స్థాయిలు, నేల పరిస్థితులు ఇలా అన్ని రకాల వాతావరణాలను తట్టుకుని ఎదిగే లక్షణాలున్న మొక్క లక్కీ బాంబూ ట్రీ. తగినంత సూర్యకాంతి, నీరు, పోషకాలు ఇవేవీ లేకుండా ఇది చాలా సంవత్సరాలు జీవించగలుగుతుంది.