Benefits Of Eating Banana Everyday :కాలంతో సంబంధం లేకుండా అన్నీ సీజన్‌లలో లభించే పండ్లలోఅరటి పండు ఒకటి. ఇందులో పోషక విలువలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే, అరటి పండ్లను కొంత మంది వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి తింటే.. మరికొందరు మాత్రం తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. అయితే తక్కువ ధరకే ఎక్కువ పోషకాలు లభించే అరటి పండును డైలీ ఒకటి తినాలని నిపుణులు అంటున్నారు. అందుకు గల కారణాలు వివరిస్తున్నారు..
పోషకాలు అధికం :బనానాలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ B6, డైటరీ ఫైబర్ వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సినన్ని పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటు అదుపులో :పొటాషియం అధికంగా ఉండే పండ్లలో అరటి పండు ఒకటి. ఇది రక్తపోటును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. రోజూ అరటిపండ్లను తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2013లో "అమెరికన్ హార్ట్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రోజుకో అరటిపండు తినే వ్యక్తులలో.. రక్తపోటు కంట్రోల్లో ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని ప్రముఖ 'డాక్టర్ జియాన్‌ఫెంగ్ లి' పాల్గొన్నారు. అరటి పండు తినడం వల్ల రక్తపోటు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
తక్షణ శక్తి : అరటిపండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. వ్యాయామానికి ముందు, తర్వాత వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :అరటిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. డైలీ అరటి పండ్లను తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు.
కడుపులో మంట :అరటి పండ్లలో ఉండే పోషకాలు కడుపులో మంటను, నొప్పిని తగ్గిస్తాయి. అందుకే తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు అరటి పండ్లను తినాలని వైద్యులు సూచిస్తుంటారు.