Back Pain Reason and Treatment: మిమ్మల్ని నడుం నొప్పి సమస్య తరచుగా వేధిస్తోందా? కాస్త మందులు వేయగానే తగ్గిపోయి మళ్లీ తిరగబెడుతుందా? ఇలా ప్రతిసారీ మళ్లీ మళ్లీ వస్తూ ఏ పని కూడా చేయనివ్వకుండా చేస్తోందా? మరి ఇందుకు గల కారణమేంటి? చికిత్స మార్గాలు ఏమైనా ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కొల్లా సాకేత్ వివరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నడుం నొప్పికి రకరకాల అంశాలు కారణం అవుతుంటాయని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కొల్లా సాకేత్ వివరించారు. సాధారణంగా వెన్నుపూసల మధ్య ఉండే రబ్బరు లాంటి డిస్కులు జారి, నాడికి నొక్కుకుపోవం వల్ల నొప్పి వస్తుంటుందని చెబుతున్నారు. ఇదే కాకుండా వెన్నుపూసలు ఒకదాని మీదికి మరోటి జారినా కూడా నొప్పి రావొచ్చని అంటున్నారు. విటమిన్ డి, క్యాల్షియం లోపం కారణంగా కూడా నడుం నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.
"మల బద్ధకం, మూత్రంలో ఇన్‌ఫెక్షన్, కిడ్నీలో రాళ్లతోనూ నడుం నొప్పి రావొచ్చు. పడుకునే పరుపు లోపలికి కుంగిపోయి, గుంతలుగా మారడం వల్ల నడుం నొప్పి వస్తుంటుంది. ముఖ్యంగా గతుకుల రోడ్డు మీద బైకు మీద ప్రయాణించటం కూడా ఒక కారణం అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం కాలంలో కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల భంగిమ దెబ్బతిన్నా నడుం నొప్పి వస్తుంది."
-- డాక్టర్ కొల్లా సాకేత్, ఆర్థోపెడిక్ సర్జన్
నడుం నొప్పి ఉన్నవారిలో ఇలాంటి కారణాలన్నింటిని గుర్తించాల్సి ఉంటుందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ కొల్లా సాకేత్ అంటున్నారు. ఇంకా వీలైతే ఎముకల వైద్య నిపుణులను సంప్రదించడం మేలని సలహా ఇస్తున్నారు. ముందు ఎక్స్‌రే, అవసరమైతే ఎంఆర్‌ఐ స్కాన్ చేస్తారని తెలిపారు. ఇంకా ఇతర కారణాలను బట్టి చికిత్స, పరిష్కార మార్గాలను సూచిస్తారని వివరించారు. ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ పరీక్ష ఫలితాలు నార్మల్‌గా ఉన్నా నొప్పి వస్తుంటే ఫైబ్రోమయాల్జియా సిండ్రోమ్ కారణం అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇవే కాకుండా శారీరక, మానసిక ఒత్తిళ్లు ఏవైనా సరే.. ఇందుకు కారణం కావొచ్చని తెలిపారు. ఆలోచనలు, ఒత్తిడి, నిరాశ, నిస్పృహలతో విపరీతంగా బాధపడే సమయంలో శరీరంలోని కొన్ని కేంద్రాలు ప్రేరేపితమై నొప్పిని కలగజేస్తాయని పేర్కొన్నారు. కాబట్టి వ్యాయామం, విశ్రాంతితో పాటు ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల నడుం నొప్పిని తగ్గించుకునే అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ముఖంపై ముడతలకు 'బేబీ బొటాక్స్' ట్రీట్మెంట్! - దీని గురించి మీకు తెలుసా?
మీరు ఉడికించిన గుడ్లు తింటున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - Is Eating Boiled Eggs Good or Bad