Ayurvedic Tips for Belly Fat: ఆరోగ్యంగా ఉండేందుకు బరువు తగ్గడం చాలా ముఖ్యం. అయితే వెయిట్ లాస్ అవడం అనేది అంత ఈజీ కాదు. చాలా కష్టంతో కూడుకున్న పని. దీనికి ఎంతో ఓపిక, సమయం, శక్తి కూడా అవసరం. బరువు తగ్గడంలో ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. కేవలం డైటింగ్ చేయడం, వర్కవుట్లు చేయడం వల్ల మాత్రమే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గుతుంది అనుకుంటే పొరబాటు పడ్డట్లే అంటున్నారు నిపుణులు. రుచికరమైన వాటిని తింటూనే శక్తిని పొందుతూనే బరువు తగ్గచ్చట. అదెలాగో ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి.
పొట్టకు ఇంగువ రాసుకోవడం
ఆయుర్వేదంలో ఇంగువకు ప్రాధాన్యం ఎక్కువ. అపానవాయువు, అజీర్తి, పొత్తి కడుపులో నొప్పి వంటి వాటికి ఇంగువ మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇప్పటికీ చాలా మంది తల్లులు తమ పిల్లలు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పుడు బొడ్డు చుట్టూ ఇంగువ రాస్తుంటారు. ఇది బరువు నిర్వహణలో కూడా చక్కగా ఉపయెగపడుతుంది. ప్రతి రోజూ ఇంగువను ఆహారంలో చేర్చుకోవడమే కాకుండా పొట్ట చుట్టూ కాస్త అప్లై చేసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గించుకోవచ్చు. చాలా మంది ఇంగువకు వెంట్రుకల కదుళ్లకు రాసుకుంటారు. ఇది జుట్టు ఎదుగుదలను కూడా బాగా ప్రోత్సహిస్తుంది.
మూడింట రెండు వంతులు తినడం
కడుపు నిండా తినే వారు బరువు తగ్గినట్లు ఎక్కడా రుజువు కాలేదు. రుచికరమైనవి, శక్తినిచ్చేవి తినాలి కానీ కడుపు నిండుగా తినడం వల్ల బరువు విషయంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. మూడింట రెండు వంతులు అంటే కేవలం 80శాతం మాత్రమే మీ కడుపును నింపుకోవాలి. నిండుగా తినడం అజీర్తికి దారితీస్తుంది. బరువును మరింత పెంచుతుంది.
ఖాళీ కడుపుతో ఈ పానీయం
బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క చక్కటి ఆహార పదార్థం. ఉదయాన్నే ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్కను వేసి బాగా మరిగించండి. తర్వాత అందులో అరటేబుల్ స్పూన్ తేనె కలిపి వడకట్టండి. ఖాళీ కడుపుతో ఈ పానీయాన్ని తాగండి. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. కిలోల కొద్దీ బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా సహాయపడుతుంది. ఇక తేనెలో ఫ్రక్టోజ్ శరీరంలో మంచి ఉత్ప్రేరకంగా పనిచేసి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన చక్కెరకు ఇది ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తుంది.