Ayurvedic Remedy to Reduce Women Health Problems: కుటుంబ బాధ్యత, ఆఫీస్ పని.. ఇలా కారణాలు ఏవైతేనేమి.. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఇంటాబయట పనులతో ఫుల్ బిజీగా ఉంటారు మహిళలు. ఈ కారణంగా తమఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. తినే తిండే, తాగే నీటిపై అంతగా శ్రద్ధ తీసుకోరు. ఫలితంగా అది మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా నెలసరి,సంతానలేమి, గర్భాశయ ఇన్ఫెక్షన్లు.. వంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం ఓ పథ్యాహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- విదారీ రసం - 100 ml
- చెరకు రసం -100 ml
- ఆవు పాలు - 100 ml
- నెయ్యి - 100 గ్రాములు
- ఎండు ఖర్జూరాల పొడి - 20 గ్రాములు
- తానికాయ పొడి - 20 గ్రాములు
- పిప్పళ్ల పొడి - 20 గ్రాములు
- యష్టి మధు చూర్ణం - 20 గ్రాములు
- చక్కెర - 200 గ్రాములు
తయారీ విధానం:
- ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులోకి విదారీ రసం, చెరుకు రసం, ఆవుపాలు, ఎండు ఖర్జూరాల పొడి, తానికాయ పొడి, యష్టి మధు చూర్ణం, పిప్పళ్ల పొడి, చక్కెర వేసి బాగా కలపాలి.
- చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మంటను సిమ్లో పెట్టి మరిగించుకోవాలి.
- ఈ మిశ్రమం మరుగుతున్నప్పుడు ఆవు నెయ్యి వేసుకుని కలపాలి. ఆవు నెయ్యి కరిగి మిశ్రమం కాస్త దగ్గరపడుతున్నప్పుడు దింపి వేరే బౌల్లోకి తీసుకోవాలి.
- చల్లారిన తర్వాత దీనిని ఓ గాజు జార్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి చేసుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఎలా తీసుకోవాలి: ఈ పథ్యాహారాన్ని ప్రతిరోజూ ఒకసారి పరగడుపున ఒక అరకప్పు వేడి పాలు లేదా వేడి నీళ్లలో 1 చెంచా కలిపి తీసుకోవాలని చెబుతున్నారు.