Ayurvedic Food Recipes For Weight Loss :ఊబకాయం సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లుతోపాటు వివిధ కారణాలతో అనేక మంది బరువు పెరుగుతున్నారు. ఆ తర్వాత బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కొవ్వు తగ్గించుకునేందుకు రకరకాల విధానాల్ని అనుసరిస్తున్నారు. ఏవేవో మందులు వాడేస్తున్నారు. కానీ సహజసిద్ధంగా ఓ ఆయుర్వేద ఆహార పదార్థం ద్వారా ఎవరైనా సరే బరువు తగ్గొచ్చు. పైగా దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి?
కావాల్సిన పదార్థాలు
- క్వినోవా
- రాజ్మా
- రెడ్ క్యాప్సికమ్
- స్వీట్ కార్న్
- సొంఠి
- ఉప్పు
- మిరియాలు
- పిప్పళ్లు
పథ్యాహారం తయారు చేసే విధానం
- ముందుగా క్వినోవా, రాజ్మాను(ఒక పూట నానబెట్టిన తర్వాత) ఉడికించి పెట్టుకోవాలి
- స్టవ్ వెలిగించి బాణలి పెట్టాలి
- మూడు కప్పులు నీరు వేసి మరిగించాలి
- ఆ తర్వాత అందులో ఉడికించిన క్వినోవా, రాజ్మా వేయాలి
- మరో గిన్నెలో రెండు చెంచాల క్యాప్సికమ్ ముక్కలు వేయాలి
- అదే గిన్నెలో గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేయాలి
- నేతిలో వేయించి పొడి చేసుకున్న సొంఠి, పిప్పళ్లను వేసుకోవాలి
- పావు చెంచా మిరియాలు వేసుకోవాలి
- బాణలిలో ఉడికిన క్వినోవా, రాజ్మాను మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి
- క్వినోవా, రాజ్మా పేస్ట్‌ను క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న గిన్నెలో వేయాలి
- ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి(ఉప్పు కాస్త తక్కువే వాడాలి)
- మొత్తాన్ని మిశ్రమంగా సిద్ధం చేసుకోవాలి
- కాసేపటి తర్వాత ఈ మిశ్రమాన్ని కట్లెట్స్లా తయారు చేసుకోవాలి
- స్టవ్ వెలిగి పెనం పెట్టాలి
- పెనం వేడి అయ్యాక నూనె వేసి కట్లెట్స్ను వేయించుకోవాలి
- అంతే బరువు తగ్గించే పథ్యాహారం రెడీ అయిపోయినట్లే!