Interesting Facts about Copper Water Bottles : మనం హెల్దీగా ఉండాలంటే రోజు సరైన పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో తగినంత నీరు తాగడం అంతే కీలకం. అయితే, ఈరోజుల్లో రాగి పాత్రలో వాటర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా వాటి వాడకం పెరిగింది. దీంతో ఎక్కడికెళ్లినా కాపర్ వాటర్ బాటిల్‌ను తీసుకెళ్తున్నారు. నిజానికి రాగి(Copper)పాత్రలో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి మీరు కూడా రాగి బాటిల్లో నీరు తాగడం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే ఉపయోగిస్తున్నారా? అయితే, ఈ బాటిల్ గురించి 10 విషయాలు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పోషక విలువలు పెరుగుతాయి :కాపర్ బాటిల్లో నీరు నిల్వ చేయడం వల్ల దాని పోషక విలువలు పెరుగుతాయి. ఫలితంగా ఆ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రాగి యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను తొలగించడం ద్వారా నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. అదేవిధంగా రాగిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు నిపుణులు.
ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి :రాగి బాటిల్లో నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. రాగి అధిక వినియోగం కాపర్ టాక్సిసిటీకి దారితీసే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కాలేయ పనితీరుపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే వికారం, వాంతులు, విరేచనాలు వంటి కొన్ని ప్రారంభ సంకేతాలను కలిగిస్తుందంటున్నారు. కాబట్టి కాపర్ వాటర్ బాటిల్స్‌ను మితంగా, సరైన మార్గదర్శకత్వంలో ఉపయోగించడం చాలా ముఖ్యమంటున్నారు.
అధిక నాణ్యత గల రాగిని మాత్రమే కొనండి : మీరు వాటర్ తాగడానికి కాపర్ బాటిల్ యూజ్ చేయాలనుకుంటే ఎప్పుడూ అధిక నాణ్యత కలిగిన వాటినే కొనాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాకాకుండా తక్కువ ధరకు లభిస్తున్నాయని నాణ్యతలేని వాటిని తీసుకుంటే అవి ఇతర లోహాలు లేదా మిశ్రమాలను కలిగి ఉండవచ్చని.. ఇవి నీటిలోకి చేరి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందంటున్నారు.
క్రమం తప్పకుండా క్లీనింగ్ :కాపర్ వాటర్ బాటిల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం. ఎందుకంటే బాక్టీరియా పెరుగుదల, ఆక్సీకరణను నివారించడానికి డైలీ క్లీనింగ్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే, వీటిని క్లీన్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ శుభ్రపరుచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.
అవి నిల్వ చేయవద్దు : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. కాపర్ బాటిల్స్‌లో వాటర్ మాత్రమే కాకుండా పండ్ల రసాలు వంటి ఇతర ద్రవాలను స్టోర్ చేసి తాగుతుంటారు. కానీ, అలా నిల్వ చేయడం మంచిది కాదనే విషయాన్ని గమనించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాగి ఆమ్ల లేదా ఆల్కలీన్ ద్రవాలతో చర్య జరుపుతుంది. ఇది మెటల్ లీచింగ్, సంభావ్య కాలుష్యానికి దారితీస్తుంది. కాబట్టి సిట్రస్ జ్యూస్‌లు, కార్బోనేటేడ్ డ్రింక్స్ లేదా యాసిడ్ ఫుడ్స్ వంటి పానీయాలను రాగి వాటర్ బాటిళ్లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచకపోవడం మంచిది అంటున్నారు.