Phobias In Children : పిల్లలు చిన్నచిన్న విషయాలకే తెగ ఆనందపడిపోతుంటారు. అలాగే చిన్న విషయాలకు కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఈ భయం కొంత మేరకు ఉంటే ఫరవాలేదంటున్నారు నిపుణులు, కానీ కొంతమంది పిల్లలు ప్రతి దానికి భయపడుతుంటారని అలాంటి భయాలకు కారణాలు ఏంటో, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జన్యుపరంగా వచ్చే లక్షణాలు :కొంతమంది పిల్లలు అందరితో కలవడానికి ఆసక్తి చూపించరు. అలాగే ఇతర పిల్లల్లా చురుకుగా ఉండరు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఇలాంటి లక్షణం ఉన్నట్లైతే పిల్లల్లో కూడా ఈ లక్షణం రావటం సహజం. సహజంగా వచ్చే అలవాటే అయినా తల్లిదండ్రులు కాస్త సమయం కేటాయించుకుని పిల్లలను భయాల నుంచి దూరం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తల్లిదండ్రుల అతి ప్రేమ ఓ కారణం : కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమతో వాళ్లని ఎక్కువగా గారాబం చేస్తుంటారు. పిల్లలు నడక నేర్చుకునే దగ్గర నుండి స్కూల్‌కి వెళ్లే వయస్సుకు వచ్చినప్పటికీ వాళ్లను స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించరు. పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారోనని అనుకుంటూ వారిని తమ పర్యవేక్షణలోనే చేయించాలనే ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. పిల్లలు వారంతట వారే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లల్ని పట్టించుకోకపోవడం :ఈ ఉరుకులు పరుగుల జీవితంలో పడి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని పట్టించుకోరు. వారి అవసరాలేంటో, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అనే అంశంపై శ్రద్ధ చూపరు. దీంతో పిల్లలు ఒంటరి తనాన్ని అనుభవిస్తారని, అందువల్ల వారు తమ సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక ఆందోళన పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా అన్నింటిల్లోనూ వెనుకపడిపోతారని, ప్రతి చిన్న విషయానికి వారిలో భయం మొదలవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
పిల్లల్లో భయం పోగొట్టాలంటే ఏం చేయాలి..
- పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెదగాలి. పిల్లల ఆలోచనలు, వారి అవసరాలు, ఇష్టాలు పంచుకునే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. వారి ఇష్టాలను తెలుసుకొని ప్రోత్సహిస్తూ ఉండాలి.
- ప్రతి విషయాన్ని పిల్లలు సొంతంగా తెలుసుకునే విధంగా ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏదైనా పని చేసినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో అనుభవపూరకంగా తెలుసుకుంటారు. మరోసారి ఆ పనిని ఎలా పూర్తి చేయాలో ఆలోచించుకోగలుగుతారు. ఆ పనిని చేయగలిగే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
- పిల్లలు ఏదైనా తప్పు చేసినా లేదా అబద్ధాలు చెప్తే వాళ్ల మీద అరవటం, తిట్టడం, కొట్టడం చేయకూడదంటున్నారు నిపుణులు. ఇలా చేయడంతో పిల్లలు మీ దగ్గర అన్ని విషయాలు మాట్లాడేందుకు భయపడతారని చెబుతున్నారు.
- పిల్లలు ఏఏ విషయాల్లో భయపడుతున్నారో గమనించాలి. అందుకోసం వారితో ప్రేమగా మాట్లాడండి. వాళ్ల భయానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు వారికి అర్థమయ్యే విధంగా పరిస్థితిని వివరించి చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు.
- మార్కుల విషయం, వ్యక్తిత్వం విషయంలోనైనా ఇతర పిల్లలతో మీ పిల్లలను పోల్చకూడదంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే పిల్లల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఒకవేళ మీ పిల్లల పద్ధతి బాగలేదంటే వారితో కూర్చుని మాట్లాడండాలని ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు .
- మీ పిల్లలకు మీరు ఏదైనా విషయంలోనైనా 'నో' చెప్పినపుడు ఎందుకు వద్దంటున్నారో వాళ్లకు అర్థం అయ్యేలా వివరంగా చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు.
- పిల్లలు ఏం చేసినా మీ మాట వినడం లేదంటే వెంటనే పిల్లల మానసిక వైద్య నిపుణుల దగ్గరకు తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గ్రహణం మొర్రి అంటే ఏంటి?- ఎందుకు వస్తుంది?- ఎప్పుడు శస్త్రచికిత్స చేస్తే బెటర్! - Cleft Lip And Cleft Palate
శారీరక శ్రమ లేకపోతే పిల్లల భవిష్యత్తుకు ప్రమాదమా?- పరిశోధనలు ఏం చెబుతున్నాయి? - Heart Attack Risks In Children