Yash Toxic Movie Producer : "కేజీఎఫ్" సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు కన్నడ స్టార్ హీరో యశ్. రాకీ భాయ్‌గా సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ స్టార్ హీరో తన నటనతో కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని ఒక్కసారిగా పెంచారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈయన తాజాగా 'టాక్సిక్' అనే సినిమాలో కనిపిస్తున్నట్లు ప్రకటించారు. మలయాళ ఫేమస్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
మరోవైపు ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. యశ్ ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారనున్నారట. KVN ప్రొడక్షన్స్‌తో పాటు ఆయన ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు.
ఇక ఈ చిత్రం కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేయనున్నారట. మొదటి షెడ్యూల్ లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో భారీ సెట్లు, చాలా మంది టెక్నికల్ టీమ్స్‌ను కూడా సిద్ధం చేశారట. అలాగే షూటింగ్ పరిసరాల్లో సౌకర్యాల విషయంలోనూ ఎక్కడా తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం. అంతే కాకుండా ఈ మూవీ కోసం వేసే భారీ సెట్లు, సాంకేతికత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఉపాధి దొరకనుందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.