Vishnu Vishal Lal Salaam : కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లాల్ సలామ్'. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రూపొందించిన ఈ సినిమాలో రజనీకాంత్ కీలకపాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఫిబ్రవరీ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషనల్ ఈవెంట్స్‌ను వేగవంతం చేసింది. అలా నటుడు విష్ణు విశాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
"నేను స్క్రిప్ట్ వినకుండానే మూవీ టీమ్‌ను చూసి సినిమాలకు ఓకే చెప్తాననిఅందరూ అనుకుంటారు. కానీ, అందులో ఏ మాత్రం నిజం లేదు. 'లాల్ సలామ్' కోసం ఐశ్వర్య రజనీకాంత్ నన్ను అడిగినప్పుడు నాకు కాస్త సమయం కావాలని ఆమెను అడిగాను. అంతే కాకుండా మొత్తం స్క్రిప్ట్‌ను వివరించాలని కోరాను. దీంతో ఐశ్వర్య ఆ స్క్రిప్ట్‌ను నాకు ఐదు గంటలు పాటు చెప్పారు. అయితే ఇలా అడిగినందుకు కొందరు నాకు అహంకారం అని అనుకున్నారు. కానీ వాస్తవమేంటంటే నేను మంచి సినిమాల్లో మాత్రమే పనిచేయాలని అనుకుంటాను. స్టోరీ ప్రేక్షకాదరణ పొందుతుందని అనుకుంటేనే నేను దానికి ఓకే చేప్తాను. అంతగా జాగ్రత్తలు తీసుకుంటాను కాబట్టే, నేను నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. అలాగని చిన్న పాత్రలు చేయాలనుకోను. హీరోగా సక్సెస్ అవ్వాలనే ఇన్నేళ్లుగా కష్టపడుతున్నాను. పెద్ద స్టార్‌ల సినిమాల్లో బ్రదర్‌గా, సెకండ్ లీడ్‌గా అవకాశాలు వచ్చినా కూడా నేను వాటికి నో చెప్పాను. మంచి సినిమాల్లో మాత్రమే నటించాలని అనుకుంటాను. రజనీకాంత్‌తో కలిసి పనిచేయాలనే నా కోరిక 'లాల్ సలామ్'తో తీరింది" అంటూ విశాల్ తన కెరీర్ గురించి చెప్పుకొచ్చారు.