తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ రివ్వూ : వెంకీ మామ ఖాతాలో హిట్‌ పడిందా? - SANKRANTHIKI VASTHUNNAM REVIEW

'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ ప్రేక్షకులను పలకరించిన వెంకటేశ్‌- మూవీ ఎలా ఉందంటే?

Sankranthiki Vasthunnam Review
Sankranthiki Vasthunnam Review (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2025, 1:22 PM IST

Sankranthiki Vasthunnam Review :టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ లీడ్​ రోల్​లో అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'సంక్రాతికి వస్తున్నాం'. సంక్రాంతి కానుకగా మంగళవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? కడుపుబ్బా నవ్వించిందా? లేదా? తెలుసుకుందాం.

స్టోరీ ఏంటంటే?
అమెరికాలో బడా వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న తెలుగువాడు సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్‌). అతనితో స్వరాష్ట్రంలో ఓ నాలుగైదు కంపెనీలు పెట్టించి, ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ (నరేశ్‌ వి.కె) తనను హైదరాబాద్‌కు తీసుకొస్తారు. అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పజెబుతాడు. అయితే సత్య భాగ్యనగరానికి రాగానే పాండే గ్యాంగ్‌ అతన్ని కిడ్నాప్‌ చేస్తుంది. అయితే ఈ విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేశవ ఓ రహస్య ఆపరేషన్‌ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు.

రహస్య ఆపరేషన్ కోసం మాజీ పోలీస్‌ అధికారి, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ యాదగిరి దామోదర రాజు అలియాస్‌ చిన్నరాజు అలియాస్‌ వెండి రాజు (వెంకటేశ్)ను రంగంలోకి దించాలని భావిస్తారు. దీంతో ఈ ఆపరేషన్‌ కోసం రాజును ఒప్పించే బాధ్యతను అతని మాజీ ప్రేయసి మీనాక్షి తీసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది? పోలీస్‌ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును ఈ ఆపరేషన్‌ కోసం మీనాక్షి ఎలా ఒప్పించింది? తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆ ఆపరేషన్‌కు పంపించడానికి భాగ్యం (ఐశ్వర్య రాజేశ్‌) ఎలా ఒప్పుకుంది? వీళ్లు ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్‌లో ఎదురైన సవాళ్లేంటి? సత్య ఆకెళ్లను తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే వరకు డూప్లికేట్‌ ఆకెళ్లతో సీఎం ఎలా మేనేజ్‌ చేశారు? అన్నది మిగిలిన కథ.

ఎలా ఉందంటే :
ఇది ఓ క్రైమ్‌ అంశంతో ముడిపడి ఉన్న కుటుంబ కథా చిత్రం. ఇందులో ఓ బ్రేకప్‌ కథ మిళితమై ఉంటుంది. ఓ బడా వ్యాపారవేత్తను ఒక రౌడీ ముఠా కిడ్నాప్‌ చేయడం, అతన్ని కాపాడి తీసుకొచ్చేందుకు ఓ మాజీ పోలీస్‌ అధికారి తన మాజీ ప్రేయసి, భార్యతో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టడం క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. నిజానికి ఈ పాయింట్‌ను చిత్ర బృందం టీజర్, ట్రైలర్లతోనే చెప్పేసినా, వాళ్ల ముగ్గురి ప్రయాణం ఎంత వినోదాత్మకంగా సాగిందన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తించే అంశం. దర్శకుడు ఈ ఆసక్తిని దృష్టిలోపెట్టుకునే ప్రేక్షకుల్ని విసిగించకుండా సత్య ఆకెళ్ల కిడ్నాప్‌ డ్రామాతో కథ మొదలెట్టేసి రెస్క్యూ ఆపరేషన్‌ పేరుతో తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయారు.ఈ ఆపరేషన్‌ కోసం తన మాజీ ప్రియుడిని తానే ఒప్పిస్తానంటూ మీనాక్షి రంగంలోకి దిగడం, మరోవైపు హీరో ఫ్యామిలీ కథ రివీలవ్వడం భార్యపై తను చూపించే ప్రేమ, పిల్లలతో కలిసి చేసే అల్లరి ఇంట్లో మామ నుంచి తనకెదురయ్యే సరదా సమస్యలతో కథంతా వినోదాత్మకంగా సాగుతుంది.

ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చే హీరో తనయుడు బుల్లిరాజు కామెడీ ట్రాక్, హాయ్‌ మెసేజ్‌పై నడిచే రచ్చ అన్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. దీనికి తోడుగా 'గోదారి గట్టు', 'మీను..' పాటలు మనసుకు ఆహ్లాదాన్ని పంచిస్తాయి. మీను-రాజు ప్రేమకథ తెలిశాక భాగ్యం ఆమె కుటుంబసభ్యులు స్పందించే తీరు, సీఎంతో జరిపే ఫోన్‌ సంభాషణ ఓ చిన్న మెలిక పెట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్‌కు భాగ్యం ఒప్పుకోవడం ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తిరేకెత్తించేలా చేస్తాయి.

ప్రథమార్ధంలాగే ద్వితీయార్ధం కూడా ఓ కిడ్నాప్‌ డ్రామాతోనే మొదలువుతుంది. జైల్లో ఉన్న పాండే గ్యాంగ్‌ మెయిన్‌ విలన్‌ను కిడ్నాప్‌ చేయడం కోసం హీరో ఎత్తుగడ వేస్తాడు. దీనికోసం హాస్పిటల్‌లో ఉత్తుత్తి కిడ్నాప్‌ పేరుతో భార్య, మాజీ ప్రేయసితో కలిసి చేసే హంగామా అక్కడక్కడా నవ్విస్తుంది. ఇక ఆ తర్వాత నుంచి కథంతా ఊహలకు తగ్గట్లుగానే చాలా రొటీన్‌గా సాగుతుంది. నిజానికి ద్వితీయార్ధంలో బలమైన సన్నివేశాలు పెద్దగా ఏమీ కనిపించవు. భాగ్యం, మీనుకు మధ్య నడిచే గిల్లికజ్జాలు, వాళ్లిద్దరి మధ్య నలుగుతూ హీరో పలికించే భావోద్వేగాలు అక్కడక్కడా నవ్వులు పంచుతాయి. పతాక ఘట్టాల్లో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌, విలన్లను చావగొడుతూ ఫ్రస్ట్రేషన్‌తో హీరో చెప్పే జీవిత సూత్రాలు మాస్‌ హీరోయిజాన్ని రుచి చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి. గురువుల గొప్పతనాన్ని చాటేలా క్లైమాక్స్‌ను తీర్చిదిద్దడం మనసుల్ని హత్తుకుంటుంది.

ఎవరెలా చేశారంటే?
గతంలో ఎన్నో పోలీస్‌ పాత్రల్లో కనువిందు చేసిన వెంకటేశ్‌ ఇందులో మాజీ పోలీస్‌ అధికారిగా ఆకట్టుకున్నారు. ఓవైపు భార్యను అమితంగా ప్రేమించే భర్తగా, మరోవైపు లవర్‌బాయ్‌గా, ఇంకోవైపు సిన్సియర్‌ పోలీస్‌గా విభిన్న కోణాల్లో కనిపించారు. సినిమా అంతా తనదైన కామెడీ టైమింగ్‌తో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా తన ప్రేమకథ గురించి భార్యకు తెలిశాక, ఓవైపు ఆమెతో మరోవైపు ప్రేయసితో వేగలేక ఫ్రస్ట్రేషన్‌తో రగిలిపోయే వ్యక్తిగా ఆయన పలికించిన భావోద్వేగాలు అలరిస్తాయి. భాగ్యంగా ఐశ్వర్య, మీనుగా మీనాక్షి వెంకీతో కలిసి పోటాపోటీగా నటించారు. వీళ్ల ముగ్గురి కామెడీ టైమింగ్‌ సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలుస్తుంది.

ఇక వెంకీ తనయుడిగా చేసిన చిన్నోడు, వీటీవీ గణేశ్, ఉపేంద్ర, మురళీధర్‌ గౌడ్‌ తదితరులంతా తమ వంతు మేర నవ్వించే ప్రయత్నం చేశారు. అవసరాల శ్రీనివాస్, సాయికుమార్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. ఇది పూర్తిగా అనిల్‌ మార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. అభిమానులు వెంకీని ఎలా చూడాలని ఆశపడతారో అంతే గొప్పగా చూపించారు. సినిమాలో ఆయన రాసుకున్న సంభాషణలు ఇటు యువతరాన్ని అటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటాయి. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం గాడి తప్పినట్లు అనిపిస్తుంది. సాగదీత సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి. కానీ, అంతిమంగా ప్రేక్షకుల్ని హాయిగా నవ్విస్తూ థియేటర్‌ బయటకు పంపడంలో విజయం సాధించాడు. భీమ్స్‌ సంగీతం సినిమాకు మరో అదనపు ఆకర్షణ. పాటల ప్లేస్‌మెంట్స్‌ అన్నీ చక్కగా కుదిరాయి. వాటిని తెరపై చూపించిన తీరు కూడా కనులవిందుగా ఉంది. విజువల్స్‌ పండగకు తగ్గట్లుగా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు:

  • కథా నేపథ్యం
  • వెంకీ, ఐశ్వర్య, మీనాక్షి కామెడీ
  • పాటలు, యాక్షన్‌ సీన్స్‌

బలహీనతలు:

  • ఊహకు తగ్గట్లుగా సాగే కథ
  • ద్వితీయార్ధం

చివరిగా: బేసికల్లీ ప్రాక్టికల్లీ లాజికల్లీ ఫుల్లీ నవ్వులే నవ్వులు!

గమనిక : ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details