Jr NTR Birthday:గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలోనే 'స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి' సినిమాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్నారు. ఇక అక్కడ నుంచి ఒక్కొ మెట్టు ఎక్కుతూ లక్షలాది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ ప్రేక్షకులను మెప్పించగల నటుడు ఎన్టీఆర్. ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఆయన సోమవారం (మే 20) తన 41 పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
- 'రామణం' సినిమానే తారక్ డెబ్యూ మూవీ అని అందరూ అనుకుంటారు. కానీ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' హిందీ వెర్షన్లో ఆయన భరతుడి పాత్రలో కనిపించారని అతికొద్ది మందికే తెలుసు.
- అమ్మ ప్రోత్సాహం వల్ల 'కూచిపూడి' నాట్యం నేర్చుకున్నారు. 12 ఏళ్ల సాధనలో దేశవ్యాప్తంగా దాదాపు వందకి పైగా పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు.
- ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితాలో తారక్ రెండు సార్లు చోటు సంపాదించారు.
- ఎన్టీఆర్‌లో ఓ మంచి మంచి గాయకుడు ఉన్నారు. ఆయన తెలుగుతో పాటు కన్నడలోనూ సాంగ్స్ పాడారు. తారక్‌కు 9 నెంబర్ అంటే చాలా ఇష్టం. అందుకే తన కార్ నెంబర్‌ను 9999గా పెట్టుకున్నారు. అంతే కాకుండా తన ట్విటర్ యూజర్ నేమ్లోనూ 9 సంఖ్య ఉంది.
- 'బాల రామాయణం' (1997) సినిమా సమయంలో డైరెక్టర్ గుణశేఖర్‌కు తారక్ కోపం తెప్పించారట. సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన విల్లును విరగ్గొట్టడం, వానర వేషం వేసిన పిల్లల తోకలు లాగడం వంటివి చేసి ఆయన ఆగ్రహానికి గురయ్యేవారట.
- 'మాతృదేవోభవ' సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తారక్ ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్. అది విన్నప్పుడల్లా చాలా ఎమోషనలై ఏడ్చేస్తుంటానని ఎన్టీఆర్ ఒకానొక సందర్భంలో చెప్పారు.
- తన తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'దాన వీర శూర కర్ణ' సినిమా తారక్ ఫేవరెట్ మూవీ.
- ఇంటర్వెల్ వరకూ జూనియర్ ఎన్టీఆర్ ఒక్క డైలాగ్ కూడా చెప్పని సినిమా 'నరసింహుడు'.
- 'ఆంధ్రావాలా' మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్ సినీ ఇండస్ట్రీలో ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. నిమ్మకూరులో జరిగిన ఆ ఈవెంట్‌కు రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం విశేషం. సుమారు 10 లక్షల మంది అభిమానులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
- తన స్కూల్ ఫ్రెండ్స్ స్నేహల్, లవ్‌రాజ్ సహా సినీ నటుడు రాజీవ్ కనకాలతో ఆయన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారట.